బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 17, 2020 , 12:11:39

ఏడుపాయలకు వెళ్తూ..

ఏడుపాయలకు వెళ్తూ..
  • ఆరుగురు దుర్మరణం
  • మెదక్‌ జిల్లా సంగాయిపేట శివారులో ఆర్టీసీ బస్సు-డీసీఎం వాహనం ఢీ
  • మృతుల్లో ఐదుగురు మహిళలు, చిన్నారి
  • మరో ప్రమాదంలో ముగ్గురు..

మెదక్‌ ప్రతినిధి, నమస్తేతెలంగాణ: మరో పదినిమిషాల్లో ఏడుపాయల అమ్మవారి సన్నిధికి చేరుకోవాల్సి ఉండగా అంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా 11 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట శివారులో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చెందిన గొడుగు రాములు సోమవారం ఏడుపాయల దుర్గామాత సన్నిధిలో నిర్వహించే శుభకార్యానికి బంధువులతో కలిసి డీసీఎం వాహనంలో బయలుదేరారు.


సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు మెదక్‌ నుంచి సంగారెడ్డి వైపు వస్తుండగా కొల్చారం మండలం సంగాయిపేట శివారులో ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ ఎగిరి డీసీఎం టైర్ల కింద పడి నుజ్జునుజ్జు కాగా, మరో నలుగురు మహిళలు డీసీఎంలోనే దుర్మరణం చెందారు. ఓ చిన్నారి దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. గాయపడిన 11 మందిని మెదక్‌ ఏరియా దవాఖానకు తరలించారు. డీసీఎం వాహనంలో ఉన్న మరో ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా బస్సులో ఉన్నవారికి ఎలాంటి గాయాలు కాలేదు.


మృతులు వీరే..

సంగారెడ్డి మండలం అంగడిపేటకు చెందిన చాపల మాధవి(40), కంది మండలం బద్రిగూడెంకు చెందిన మన్నె మంజుల(40), ఫసల్‌వాదికి చెందిన గొడుగు రజిత(45), గంజిగూడెంకు చెందిన నీరుడి దుర్గమ్మ (55), గుడాల మాణెమ్మ(55) అక్కడికక్కడే మృతి చెందారు. ఫసల్‌వాదికి చెందిన దిగ్వాల్‌ మధురిమ(9) మెదక్‌ ఏరియా దవాఖానలో చికిత్స పొందుతూ మరణించింది. కాగా కుమ్మరి జానకి, అనసూయ, యాదమ్మ, ఈశ్వరమ్మ, చందు, లక్ష్మి, సువర్ణ, శివలీల, గౌరి, లక్ష్మి, జియావుద్దీన్‌(డీసీఎం డ్రైవర్‌) గాయపడ్డారు. 


కలెక్టర్‌ పరామర్శ..

ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి ఏరియా దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మార్చురీలో ఉన్న మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డీసీఎంలో ఉన్న వారు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


మంత్రులు హరీశ్‌, పువ్వాడ దిగ్బ్రాంతి

మెదక్‌ జిల్లా సంగాయిపేట శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని మంత్రి పువ్వాడ హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. 


నార్సింగి వద్ద ముగ్గురు..


మెదక్‌ జిల్లా రామాయంపేట సర్కిల్‌ పరిధిలోని నార్సింగి జాతీయ రహదారి వద్ద ఆదివారం అర్ధరాత్రి లారీ-ఓమ్నీ వ్యాన్‌ ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్‌ కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చెందిన వీరవాణి కృష్ణ తన తోడల్లుడు రవి దుబాయ్‌కి వెళ్తున్నాడు. కృష్ణ తన స్నేహితుడి ఓమ్నీ వ్యాన్‌ తీసుకొని మాచారెడ్డి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లి రవికి వీడ్కోలు పలికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ వ్యాన్‌లో ఐదుగురు ఉన్నారు. నార్సింగి శివారుకు రాగానే జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వ్యాన్‌ డీకొట్టింది. ఈ ప్రమాదంలో వీరవాణి కృష్ణ(28), కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన పిట్ల కిష్టయ్య(60), అంజయ్య(25)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కావ్య, అజయ్‌లకు తీవ్రగాయాలు కాగా రామాయంపేట దవాఖానకు తరలించారు.


logo
>>>>>>