సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:38

నకిలీ వేబిల్లులతో ఇసుక దందా

నకిలీ వేబిల్లులతో ఇసుక దందా

  • నిందితుల్లో టీఎస్‌ఎండీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు
  • లైసెన్స్‌డ్‌ ఇసుక కాంట్రాక్టరే సూత్రధారి

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: నకిలీ వే-బిల్లులు సృష్టించి ఇసుక అక్రమదందాకు పాల్పడుతున్న ముఠాను సోమవారం రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టుచేశారు. ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్‌భాగవత్‌ వివరాలను వెల్లడించారు. హన్మకొండకు చెందిన కిరణ్‌కుమార్‌ ములుగు జిల్లా మల్యాలలోని ఓ ఇసుక స్టాక్‌యార్డ్‌ను ఆరునెలలపాటు కాంట్రాక్ట్‌ తీసుకున్నాడు. ఆదాయం పెద్దగా లేకపోవడంతో స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి టీఎస్‌ఎమ్‌డీసీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు నవీన్‌కుమార్‌, భార్గవ్‌, మల్లికార్జున్‌, లక్ష్మణ్‌తో ముఠా ఏర్పాటుచేశారు. టీఎస్‌ఎండీసీ జారీచేసే వేబిల్లుల పేపర్‌రోల్స్‌ తెప్పించి వాటిపై నకిలీ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించి అక్రమాలకు తెరలేపారు. రాజశేఖర్‌ తనకు పరిచయం ఉన్నవారి లారీల్లో రూ.25 వేలకు ఇసుక లోడ్‌చేసి, నకిలీ వేబిల్లు ఇచ్చి బయటికి పంపేవాడు. టీఎస్‌ఎండీసీ వే బిల్లు ఉండటంతో తనిఖీ అధికారులు ఆపేవారు కాదు. ఒక్కోలారీకి రూ.10 వేల చొప్పున కిరణ్‌కుమార్‌ ఈ ముఠా సభ్యులకు చెల్లించేవారు. అలా వచ్చిన డబ్బును సభ్యులు పంచుకొనేవారు. కాంట్రాక్టర్‌కు లారీకి 15 వేల రుపాయలు మిగిలేవి. కాంట్రాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ముఠా ఇలా దాదాపు 500 లారీల ఇసుకలోడ్‌లను తరలించినట్టు విచారణలో తేలింది. 


logo