శనివారం 11 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 13:22:28

ఆకెరు వాగుపై కొత్తగా ఆరు చెక్‌ డ్యామ్‌లు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

ఆకెరు వాగుపై కొత్తగా ఆరు చెక్‌ డ్యామ్‌లు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

మహబూబాబాద్‌ : జిల్లాలోని ఆకెరు వాగుపై కొత్తగా ఆరు చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మోచరాజుపల్లిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోత్‌ కవిత నేడు పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, జెడ్పీ చైర్మన్‌ బిందు, కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ... కరోనా మహమ్మారి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతిఒక్కరు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. పచ్చదనం-పరిశుభ్రతకి సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తునట్లు చెప్పారు. గత పాలనలో రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారు. తెలంగాణ సోనా బియ్యం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. మహబూబాబాద్‌లో 25 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల గోడౌన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ఉద్యోగాలు వదిలి వ్యవసాయం చేసేందుకు యువత గ్రామాలబాట పడుతున్నరని మంత్రి పేర్కొన్నారు.

మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ... పట్టణాల్లో, గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పారిశుద్ధ్యంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారన్నారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నరని తెలిపారు. లాభాలు ఉండే పంటలను రైతులు పండించాలి. రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నట్లు చెప్పారు. లాభాల సాగు దిశగా రైతు పయనించాలని పిలుపునిస్తే దానిని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మే స్థితిలో రైతులు, ప్రజలు లేరన్నారు.logo