ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నెరవేరనున్న సొంతింటి కల

నెరవేరనున్న సొంతింటి కల

Feb 15, 2020 , 02:29:53
PRINT
నెరవేరనున్న సొంతింటి కల
  • పంపిణీకి సిద్ధంగా సిరిసిల్ల డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
  • సకల వసతులతో 1,320 గృహాల నిర్మాణం
  • ఉగాది కానుకగా అందించేందుకు సన్నాహాలు
  • మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఏర్పాట్లలో అధికారులు

సిరిసిల్ల రూరల్‌: సిరిసిల్ల పేదల సొంతింటి కల అతిత్వరలో సాకారం కాబోతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో పనులు పూర్తయి.. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. రూ.80 కోట్లతో 30 ఎకరాల సువిశాల స్థలంలో అధునాతన హంగులు, సకల వసతులతో 1,320 ఇండ్లు నిర్మాణం పూర్తిచేసుకున్నాయి. ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో విశాలమైన రోడ్లు.. డ్రైనేజీలు.. అన్ని హంగులతో పంపిణీకి సిద్ధమయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్ష సమావేశం లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించడంతో, అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఇండ్లను సిరిసిల్లవాసులకు ఉగాది కానుకగా అందించనుండగా.. పేద, మధ్యతరగతి వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


సకల వసతులు..

తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో 2017 మార్చి 10న డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. వీటి నిర్మాణ బాధ్యతలను జాతీయస్థాయిలో పేరున్న హైదరాబాద్‌కు చెందిన నవతేజ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీకి అప్పగించారు. ఇందు లో సిరిసిల్ల వాసులకు 1,260, మండెపల్లివాసులకు 60ఇండ్లు కేటాయించారు. రూ.80 కోట్లతో జీ+4 విధానంలో ఒక్కో బ్లాక్‌కు 12 ఇండ్ల చొప్పున మొత్తం 105 బ్లాకుల్లో నిర్మాణాలు చేపట్టారు. మరో రూ.21 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు పూర్తిచేశారు. రూ.8 కోట్లతో మండెపల్లి నుంచి ఇండ్ల వరకు 1.8 కి.మీ. బీటీ డబుల్‌ రోడ్డు వేశారు. ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీటిని అందించనున్నారు. ప్రహరీ, రోడ్డుకు ఇరుపక్కలా డ్రైనేజీలు, ఐదెకరాల్లో పార్కులు, పైలాన్‌ ఏర్పాటుచేశారు. 40 ఫీట్ల ప్రధాన రహదారి, 30 ఫీట్ల కాలనీ రోడ్లు, ప్రధాన గేటుతో కాలనీని నిర్మించారు. 


రాష్ర్టానికే తలమానికంగా.. 

సిరిసిల్లలో నిర్మించే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు రాష్ర్టానికే తలమానికంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ హయాంలో నిర్మించిన ఇరుకు గదుల్లా కాకుండా పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని భావించారు. అమాత్యుడి ఆలోచనకు అనుగుణంగా సిరిసిల్ల పట్టణంలో అనువైన స్థలం లేకపోవడంతో తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని 30 ఎకరాల్లో 1,320 డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల పనులను ఏకకాలంలో చేపట్టారు. నిర్మాణాలు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మంత్రి నిరంతరం పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సుందరీకరణ, మౌలిక వసతుల కల్పనతోపాటు భద్రతకు పెద్దపీట వేశారు. 

 

కేసీఆర్‌ నగర్‌గా నామకరణం!

మండెపల్లి శివారులో దాదాపు 5 వేల మంది నివసించేలా నిర్మించిన 1,320 డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కాలనీకి సీఎం కేసీఆర్‌ పేరు పెట్టాలని.. కేసీఆర్‌ నగర్‌ పేరుతో కాలనీని ప్రారంభించే యోచనలో మంత్రి కేటీఆర్‌ ఉన్నట్టు తెలిసింది. ఉగాది పండుగకు సిరిసిల్ల ప్రజలకు కానుకగా ఈ ఇండ్లను అందించేందుకు మంత్రి ఆదేశాలతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


logo