శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 00:43:52

అతిక్రమిస్తే ఉపేక్షించం

అతిక్రమిస్తే ఉపేక్షించం

  • రోడ్డెక్కిన వాహనాలు సీజ్‌
  • ప్రయాణికులను తరలిస్తున్న మూడు అంబులెన్సులు
  • రాష్ట్రవ్యాప్తంగా అనేక వాహనాలు, ఆటోలు, బైక్‌లు స్వాధీనం
  • ఐపీసీ 188, 54 డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద కేసులు

న్యూస్‌నెట్‌వర్క్‌, నమస్తేతెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధన ఉల్లంఘించి అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై ఐపీసీ సెక్షన్‌ 188, 54 డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ కింద అధికారులు కొరడా ఝుళిపించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రయాణికులను చేరవేస్తున్న వాహనాలు, ఆటోలు సీజ్‌చేశారు. రోడ్లపైకి వచ్చి ద్విచక్రవాహనాదారులపైనా కేసులు నమోదుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెరిచిన దుకాణాలకు సీజ్‌ చేశారు. ప్రయాణికులతో వెళ్తున్న మూడు అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దు సూర్యాపేట జిల్లా కోదాడ మండలం 65వ జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆబ్కారీ అధికారులు 20 మద్యంషాపులు, తొమ్మిది బెల్లం దుకాణాలను సీజ్‌చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజక వర్గంలో 19 వైన్స్‌లకు ఎక్సైజ్‌ అధికారులు తాళా లు వేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండు వైన్‌ షాపుల నుంచి రూ.84 వేల విలువైన మద్యాన్ని రెండు ఆటోల్లో అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిబంధల ను అతిక్రమించి ఆటోలను నడిపిన పలువురు డ్రైవర్లపై కేసులు నమోదుచేశారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 225 ద్విచక్ర వాహనాలు, 110 ఆటోలు, 54 ట్రాన్స్‌పోర్టు వాహనాలను పోలీసులు సీజ్‌చేశారు. నిర్మల్‌ జిల్లాలో ఆటోలు 45, కార్లు 2, బైక్‌లు 5, డీసీఎం వ్యాన్‌ ఒకటి, కామారెడ్డి జిల్లాలో 200 బైక్‌లు, 10 కార్లు, వంద ఆటోలు, నిజామాబాద్‌ జిల్లాలో వంద ఆటోలను సీజ్‌ చేశారు. 

వాహనాలు స్వాధీనం..

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 2,480, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 105, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 244 వాహనాలను పోలీస్‌ సీజ్‌చేశారు. హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల పరిధిలో లాక్‌డౌన్‌ ధిక్కరించిన 24 మందితోపాటు ఐదు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. బంజారాహిల్స్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి, మేడ్చల్‌ జిల్లా కీసరలో 18 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గం చైతన్యపురిలో ఐదు దుకాణాలపై కేసు నమోదు చేశారు.

చెక్‌పోస్టుల వద్ద అడ్డగింతలు

రోడ్లపైకి వచ్చిన వాహనాలను ఎక్కడికక్కడే అధికారులు, పోలీసులు నిలిపివేశారు. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో ఉన్న రాష్ట్ర సరిహద్దులతోపాటు జిల్లాల పొలిమెరల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలను అడ్డుకున్నారు. అత్యవసర సేవలు అందించే వాహనాలకు అనుమతినిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆంధ్రా సరిహద్దులోని అశ్వారావుపేట, దమ్మపేట, భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని చర్ల వద్ద ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల్లో  పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చేవారిని జిల్లాలోకి ప్రవేశించకుండా అడ్డుకొని వెనక్కి పం పించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సరిహద్దుల్లోని సిర్పూర్‌(టి), వాంకిడిలో చెక్‌పోస్టులతోపాటు ప్రాణహిత వద్ద పోలీసులు పహారా పెంచారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో రాష్ట్ర సరిహద్దులైన పుల్లూరు, నందిన్నె, సింధనూరు చెక్‌పోస్ట్‌ల వద్ద భద్రత పెంచారు. ఇతర రాష్ర్టాల నుంచి ఎవరినీ అనుమతించడం లేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా నల్లమల ప్రాంతంలోని రాష్ట్ర సరిహద్దు ఫారెస్ట్‌ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూర్‌, దోమలపెంట ఫారెస్ట్‌ చెక్‌పోస్టుల వద్ద వాహనాలను అనుమతించలేదు.

340 వాహనాలు సీజ్‌

డీటీసీ పాపారావు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన 340 భారీ వాహనాలు సీజ్‌చేసినట్టు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఐటీ డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కే పాపారావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలను రంగంలోకి దింపి, నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను చేరవేస్తున్న ఆటోలు, క్యాబ్‌లు, ఇతర వాహనాలను సీజ్‌చేసినట్టు ఆయన వెల్లడించారు. వీటన్నింటినీ లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాతే విడుదలచేస్తామని తెలిపారు.


మీకు బాధ్యత లేదా?

  • రోడ్లపైకొచ్చిన జనంపై సిరిసిల్ల కలెక్టర్‌ ఆగ్రహం
  • దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ నేత అరెస్టు

లాక్‌డౌన్‌ను అతిక్రమించి నిర్లక్ష్యంగా రోడ్లపైకి వచ్చిన జనంపై రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.గుంపులుగా జనం రోడ్లపైకి రావడంతో వారిని అదుపుచేసేందుకు కలెక్టర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. కార్లు, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని ఆపి, మరోసారి రోడ్లపైకి వస్తే కేసులు పెడతామని హెచ్చరించి తిప్పి పంపించారు. ప్రాణాంతక కరోనా కట్టడికి ప్రభుత్వం పెట్టిన నిబంధనను బాధ్యతగా భావించరా? అని నిలదీశారు. కుటుంబంలో ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కోవాలని సూచించారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు గుగ్గిల్ల శ్రీకాంత్‌గౌడ్‌ ద్విచక్రవాహనంపై రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల పట్ల దురుసుగా వ్యహరించాడు. అక్కడే ఉన్న కలెక్టర్‌.. ‘నలుగురికి చెప్పాల్సిన మీరే ఇలా ఉంటే ఎలా?’అంటూ సదరు నేతను అరెస్ట్‌ చేయాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


logo