మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 20:11:00

సోలార్‌ ప్లాంటుల నిర్మాణ ఏజెన్సీలతో సింగ‌రేణి సన్నాహాక సమావేశం

సోలార్‌ ప్లాంటుల నిర్మాణ ఏజెన్సీలతో సింగ‌రేణి సన్నాహాక సమావేశం

హైద‌రాబాద్ : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మించనున్న మూడ‌వ‌ దశ సోలార్‌ పవర్‌ ప్లాంటుల నిర్మాణ కాంట్రాక్టును పొందిన ఏజెన్సీలతో సీఎండీ శ్రీ‌ధ‌ర్ ఆదేశాల మేర‌కు డైరెక్టర్‌ (ఇ&ఎం) డి.సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఒప్పంద పూర్వ (ప్రి-అగ్రిమెంట్‌ కిక్‌ ఆఫ్‌) సన్నాహాక సమావేశాన్ని హైద్రాబాద్‌ సింగరేణి భవన్‌ లో శుక్రవారం నిర్వహించారు. నిర్మాణ ఏజెన్సీలైన అదానీ గ్రూపు, నోవస్‌ గ్రీన్‌ సంస్థ ప్రతినిధులతో పాటు మూడు ప్రాంతాల‌ జనరల్‌ మేనేజర్లు, ఇతర అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఇటీవల బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో 80.5 మెగావాట్ల మూడవ దశ సోలార్‌ ప్లాంటుల నిర్మాణం పనుల కాంట్రాక్టుకు ఆమోదం లభించిన తక్షణమే సంబంధిత ఏజెన్సీలకు అంగీకార సమాచార లేఖను యాజమాన్యం పంపించింది. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేయాలని అనుకొంటున్నప్పటికీ అంతకన్నా చాలా ముందుగానే పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఒప్పంద వ్యవహారాలు లిఖిత పూర్వక అగ్రిమెంటుగా ఖరారు చేయడానికి ఈ సమావేశాన్ని నిర్వహించారు.

మూడు రకాల ప్లాంటులు - రెండు ఏజెన్సీలు

మూడ‌వ‌ దశలో 3 రకాల సోలార్‌ ప్లాంటులు ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తం 80.5 మెగావాట్లలో 33.5 మెగావాట్ల ప్లాంటులను నేల‌పై నిర్మించబోతున్నారు. వీటిలో కొత్తగూడెం గరిమెల్లిపాడులో 22.5 మెగావాట్ల ప్లాంటు, శ్రీరాంపూర్‌ ఏరియా పరిధిలోని చెన్నూరు గనుల వద్ద 11 మెగావాట్ల ప్లాంటు నిర్మించబోతున్నారు. ఈ రెండు ప్లాంటుల నిర్మాణం పనుల కాంట్రాక్టును అదానీ కంపెనీ దక్కించుకుంది. వీటి నిర్మాణం 12 నెలలలోపే పూర్తి చేస్తారు.

ఓవర్‌ బర్డెన్‌ డంపుల మీద సోలార్‌ ప్లాంటులు

కాగా సింగరేణిలో తొలిసారిగా మూతపడిన ఓపెన్‌ కాస్ట్‌ గనుల ఓ.బి. డంపుల పైభాగాన రెండు చోట్ల మొత్తం 32 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సోలార్‌ పవర్‌ ప్లాంటులు నెలకొల్పబోతున్నారు. రామగుండం-3 ఏరియాలో గల ఓపెన్‌ కాస్ట్‌-1 డంపుల పైభాగాన 22 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు, బెల్లంపల్లి డోర్లీ ఓ.సి. గని-1 ఓ.బి. డంపుల మీద 10 మెగావాట్ల ప్లాంటు నెలక్పొబోతున్నారు. ఈ పనిని కూడా అదానీ కంపెనీ వారే చేపట్టనున్నారు. ఏడాదిలోగా నిర్మించనున్నారు.

నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటు

ఇవి కాక తొలిసారిగా నీటిపై తేలియాడే రెండు సోలార్‌ ప్లాంటులకు కంపెనీ ఆమోదం తెలిపింది. సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గల భారీ వాటర్‌ రిజర్వాయర్‌ నీళ్లపై 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు, బెల్లంపల్లి ఏరియాలో మూతపడిన డోర్లీ ఓ.సి.-1 క్వారీ నీళ్లపై 5 మెగావాట్ల ప్లాంటులను నిర్మించబోతున్నారు. ఈ కాంట్రాక్టును నోవస్‌ గ్రీన్‌ ఎనర్జీ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకోవడం జరిగింది. ఈ సంస్థ ఇతర సంస్థలతో కలిసి మహారాష్ట్ర లో 230 మెగావాట్ల భారీ నీటిపై తేలియాడే సోలార్‌ ప్లాంటులను నిర్మించిన అనుభవం ఉంది. ఈ సారి నిర్మాణంలో దేశీయంగా తయారైన సోలార్‌ వోల్టాయిస్‌ ప్లేటులను వాడడునుండ‌టం ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవ‌చ్చు. 


logo