శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 15:29:43

ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటిన సింగరేణి

ఒక్క రోజే 2 లక్షల మొక్కలు నాటిన సింగరేణి

భద్రాద్రి కొత్తగూడెం :  సింగరేణి సంస్థ తెలంగాణాకు హరితహారం కార్యక్రమంతో పాటు.. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘వృక్షారోపన్‌ అభియాన్‌’ కార్యక్రమం కింద ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలను సింగరేణి ప్రాంతాల్లో నాటుతున్నామని సింగరేణి  సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. గురువారం ఒక్కరోజే సింగరేణిలోని 11 ఏరియాల్లో 2 లక్షల మొక్కలు నాటుతున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్  సింగరేణి భవన్‌ లో ఆయన తెలంగాణాకు హరితహారం, వృక్షారోపన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని మొక్క నాటి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా శ్రీధర్  మాట్లాడుతూ.. తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది 804 హెక్టార్లలో 35.47 లక్షల మొక్కలు నాటుతున్నామని, ఇప్పటికే ఈ కార్యక్రమం కింద 11 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు కంపెనీల్లో జరుగుతున్న వృక్షారోపన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని సింగరేణిలో కూడా అమలు చేస్తూ  మొక్కలు నాటుతున్నామని వివరించారు. సింగరేణి సమీప గ్రామాల ప్రజలకు ఈ ఏడాది 2.5 లక్షల పండ్ల మొక్కలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. సింగరేణి సంస్థ ఇప్పటి వరకూ 11 ఏరియాల పరిధిలో 12,172 హెక్టార్లలో 5 కోట్ల 40 లక్షల మొక్కలు నాటిందని వివరించారు. 

వీటిలో 75 శాతం అడవులుగా పెరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణాకు హరితహారం కార్యక్రమం ప్రారంభం నుండి ఇప్పటి వరకూ దాదాపు 4 కోట్ల మొక్కలు సింగరేణి నాటిందని  పేర్కొన్నారు. సింగరేణి సంస్థతో పాటు సింగరేణి ఉద్యోగులు, కార్మికులు సమీప గ్రామాల ప్రజలు కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.


logo