శనివారం 16 జనవరి 2021
Telangana - Dec 23, 2020 , 19:46:39

సవాళ్లను ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉంది : సీఎండీ ఎన్‌.శ్రీధర్

సవాళ్లను ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉంది : సీఎండీ ఎన్‌.శ్రీధర్

హైదరాబాద్ :  ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉందని ఆ సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో ఆ సంస్థ శతాబ్ది ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీధన్‌ సింగరేణి పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 1998కి ముందు వరుసగా 20 ఏండ్లపాటు సంస్థ నష్టాలను చవిచూసినదని గుర్తుచేశారు. కార్మికులు, అధికారుల సమిష్టి కృషితో నష్టాల నుంచి బయటపడి 20 ఏండ్లుగా లాభాలను ఆర్జిస్తున్నదని తెలిపారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సహాయ, సహకారాలతో ఉత్పత్తి, లాభాల్లో దేశంలోనే అగ్రగామి సంస్థగా సింగరేణి ఎదిగిందని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో వ్యాపారాలు నిలిచిపోయినా కార్మికులకు చెల్లించాల్సిన రూ.540 కోట్ల బోనస్‌ చెల్లించామని, అన్నిరకాల సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తున్నామని చెప్పారు. మార్కెట్‌ పరిస్థితులు మారడంతో కోలిండియాతోపాటు ప్రైవేటు బొగ్గు ఉత్పత్తిదారులతో సింగరేణి పోటీపడాల్సి వస్తున్నదని అన్నారు. బొగ్గు ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, యంత్రాలు, ఉద్యోగుల పనిగంటలు పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి పెంచాలని అభిప్రాయపడ్డారు.

కార్మికుల సంక్షేమంలో దేశంలోని అన్ని కంపెనీల కన్నా సింగరేణి ముందున్నదని చెప్పారు. కార్మికులు ఉత్పాదకత పెంపునకు కృషి చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులు డీజీఎం (మార్కెటింగ్‌ & స్ట్రాటజీ ప్లానింగ్‌) మారెపల్లి వెంకటేశ్లర్లు, డీజీఎం (లా) ఎన్‌.వెంకటేశ్వర్‌, న్యాయ విభాగం పీఏ బీవీ పద్మావతి, ఎస్‌పీసీ సెక్యూరిటీ గాదే హరేరామ్‌ను ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అడ్వయిజర్‌ (మైనింగ్‌)డీఎన్‌ ప్రసాద్‌, అడ్వయిజర్‌ (ఫారెస్ట్రీ) కే సురేంద్రపాండే, జీఎం (సీడీఎన్‌) కే రవిశంకర్‌, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.