బుధవారం 08 జూలై 2020
Telangana - May 26, 2020 , 02:50:16

సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ తగ్గే ప్రమాదం

సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ తగ్గే ప్రమాదం

  • బొగ్గు’ఆశలు బుగ్గిపాలు
  • సింగరేణికి సంకటంగా కేంద్రం నిర్ణయం 
  • కొత్త బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణతో ముప్పు 
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు

కొత్త బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థ సింగరేణికి సంకటంగా మారనున్నది. ఈ కుట్రలతో బొగ్గుపై పెట్టుకున్న ఆశలు బుగ్గిపాలుకానున్నాయి. కొత్త ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మికసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెనుకకు తీసుకొనేవరకు ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

గోదావరిఖని: దేశంలో బొగ్గు కొరతను తీర్చడం, విదేశీ బొగ్గు దిగుమతిని తగ్గించే పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గు ఉత్పత్తి ప్రైవేటీకరణ నిర్ణయం ప్రభుత్వరంగ సంస్థలకు శరాఘాతంగా తయారుకానున్నది. భవిష్యత్‌లో ఆ సంస్థలకు నష్టాల బాటవేయనున్నది. దేశవ్యాప్తంగా కేంద్రం ఆధీనంలోని కోల్‌ఇండియా సబ్సిడరీ కంపెనీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ మాత్రమే బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఏటా 600 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీసి 70 శాతం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు సరఫరాచేస్తున్నాయి. భారీ ఆదాయాన్ని పొందుతున్నాయి. రాష్ట్రంలోని సింగరేణి సంస్థ ప్రస్తుతం ఏటా 65 మిలియన్‌ టన్నులను వెలికితీస్తుండగా, ఇందులో తెలంగాణకి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి మెజార్టీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు తెలంగాణతోపాటు పలు రాష్ర్టాల్లోని విద్యుత్‌ సంస్థలకు 80శాతానికి పైగా బొగ్గును అందిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నది. కేంద్రానికి చెందిన ఒక్క ఎన్టీపీసీకే నిత్యం 40 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తున్నది. జెన్‌కో సంస్థలకు భారీగా బొగ్గు అందిస్తున్నది. గతంలో నష్టాల్లో నడిచిన సంస్థ స్వరాష్ట్రంలో రూ.వేలకోట్ల లాభాలను గడిస్తున్నది. దేశవ్యాప్తంగా కొత్తగా 500 బొగ్గు బ్లాకులను ప్రైవేటుకు అప్పగించాలని కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఇది అమలైతే భవిష్యత్‌లో సింగరేణి నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. దేశంలో బొగ్గు కొరతను తీర్చడానికి, విదేశీ బొగ్గు దిగుమతిని తగ్గించడానికే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకొచ్చామని కేంద్రం చెప్తున్నప్పటికీ.. దీనివల్ల సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ పడిపోయి, ఉద్యోగావకాశాలు తగ్గే ప్రమాదం ఉన్నది.

కోల్‌ఇండియా, సింగరేణికి భారీ పోటీ 

దేశంలో కోల్‌ఇండియా సబ్సిడరీ కంపెనీలు, సింగరేణి సంస్థ ఏటా దాదాపు 600 మిలియన్‌ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, మరో 200 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గు కొరతను అధిగమించడంతోపాటు ఉత్పత్తిలో పోటీతత్వాన్ని పెంచి, నిరుద్యోగ యువతకు పుష్కలంగా ఉపాధి చూపాలనే ఉద్దేశంతోనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తెరపైకి తెచ్చామని కేంద్రం వాదిస్తున్నది. ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేయడం తప్ప ఈ విధానంతో పెద్ద ప్రయోజనం ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. కొత్త బొగ్గు బ్లాకులకు అవసరమైన సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లను ఖర్చు చేయడానికి నిర్ణయించినట్టు పేర్కొనడం విశేషం. గతంలో కోల్‌ఇండియా, సింగరేణి సంస్థలకు సంబంధించి బొగ్గు బ్లాకులు దక్కించుకున్న సందర్భంలో కేంద్రం ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు.

సింగరేణికి పొంచి ఉన్న ముప్పు

కేంద్ర నిర్ణయంతో అటు కోల్‌ ఇండియా, ఇటు సింగరేణికి భవిష్యత్‌లో భారీ నష్టంకలిగే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు కోల్‌ఇండియా, సింగరేణి మాత్రమే బొగ్గు బ్లాకులు దక్కించుకునే అవకాశం ఉండేది. తాజా నిర్ణయంతో పోటీపడే ఏ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థ అయినా వేలంలో బొగ్గు బ్లాకులు పొందే వీలున్నది. ప్రస్తుతం భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9 కొత్త బ్లాకుల అనుమతుల కోసం సింగరేణి వేచిచూస్తున్నది. ఈ బ్లాకులు.. కేంద్రం ప్రకటించిన 500 బ్లాకుల్లోనే ఉన్నాయి. వీటిని వేలం పద్ధతి ద్వారా ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ బొగ్గును కొనే సంస్థలే దక్కించుకుంటే.. సింగరేణి బొగ్గును ఎవరు కొంటారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతున్నది. నిత్యం 40 వేల టన్నులకుపైగా బొగ్గును కొనే ఎన్టీపీసీ కొత్త బొగ్గు బ్లాకులను దక్కించుకుంటే సింగరేణి బొగ్గును కొనుగోలు చేయదు. దీంతో సింగరేణి సంస్థ పరిస్థితి దారుణంగా మారుతుంది. ప్రైవేటులో బ్లాకులు దక్కించుకునేవారు తక్కువ ధరకే బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుండటంతో ప్రభుత్వ సంస్థలకు ఇబ్బందులు తప్పవని పలువురు పేర్కొంటున్నారు.

బొగ్గు డిమాండ్‌ పడిపోయే ప్రమాదం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని టీబీజీకేఎస్‌ నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కొత్తగా ఏర్పాటుచేసే 500 బొగ్గు బ్లాకులను పోటీ పద్ధతిలో వేలంవేయడానికి తీసుకున్న నిర్ణయం వల్ల సింగరేణి సంస్థకు పెద్ద ముప్పు పొంచి ఉంటుంది. ఇప్పటివరకు సింగరేణి నుంచి బొగ్గు కొంటున్న సంస్థలు పోటీలో నిలిచి దక్కించుకుంటే సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ తగ్గుతుంది. కొత్త ఉద్యోగాలు తగ్గుతాయి. కేంద్రం తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలి. లేదంటే ఆందోళన చేపడుతాం. 

మిర్యాల రాజిరెడ్డి, (టీబీజీకేఎస్‌) తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి

ప్రైవేటీకరణ సరికాదు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయం సరైనది కాదు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు కృషిచేయాల్సిన కేంద్రం.. దాన్ని మరిచి ప్రైవేటు సంస్థలకు గనులు కట్టబెట్టడం ఏమాత్రం మంచిది కాదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించే అవకాశం ఉన్నది. సింగరేణిని కాపాడుకునేందుకు కృషిచేస్తాం. టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో అందోళనలు చేపడుతాం. 

టీబీజీకేఎస్‌ ఆర్జీ-2  ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్‌ 

అడ్డుకునే బాధ్యత జాతీయ సంఘాలదే 

కేంద్రం బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే భవిష్యత్‌లో సింగరేణికి తీవ్రంగా నష్టం కలిగే అవకాశ ఉన్నది. ఈ ప్రక్రియను అడ్డుకునే బాధ్యత జాతీయ సంఘాలు తీసుకోవాలి. ఒక్క సింగరేణి వ్యాప్తంగానే గాక కేంద్రంలో మార్పు వచ్చేలా జాతీయస్థాయిలో కార్మిక ఉద్యమాలు లేవనెత్తాలి. 

 అనిల్‌రెడ్డి, పంప్‌ ఆపరేటర్‌, ఆర్జీ-2logo