శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 03:39:33

మీ ఇంటికి మీదే అనుమతి

మీ ఇంటికి మీదే అనుమతి

  • రిజిస్ట్రేషన్‌ కాగితమే అనుమతిపత్రం
  • 75 గజాల్లోపు స్థలముంటే ఇల్లు కట్టుకోవచ్చు 
  • 500 గజాలలోపు స్వీయధ్రువీకరణ పత్రం చాలు
  • 500 గజాలు దాటితే 21 రోజుల్లోనే అనుమతులు
  • టీఎస్‌-బీపాస్‌తో సరళీకృత నిర్మాణ అనుమతులు
  • భవన నిర్మాణ అనుమతుల్లో తెలంగాణ ప్రభుత్వం 

విప్లవాత్మకమైన విధానాన్ని తీసుకువచ్చింది. కొత్తగా ఇల్లు కట్టుకొనేవారు అనుమతి కోసం రోజులతరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. సరళీకృత, ఏకీకృత విధానం టీఎస్‌-బీపాస్‌ను అమల్లోకి తెచ్చింది. కేవలం 21 రోజుల్లో నిర్మాణ అనుమతులను మంజూరు చేసేలా టీఎస్‌- బీపాస్‌ను రూపొందించింది. 75 గజాలలోపు స్థలం ఉంటే రిజిస్ట్రేషన్‌ కాగితాన్నే అనుమతిపత్రంగా భావిస్తూ ఇల్లు కట్టుకోవచ్చు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: 75 గజాల్లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే కేవలం రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది. 500 గజాలలోపు స్థలంలో భవనం నిర్మించుకొనేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని స్వీయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి.. నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చని టీఎస్‌- బీపాస్‌ నిబంధనల్లో పేర్కొన్నారు.

దేశంలోనే ఎక్కడాలేనివిధంగా భవన నిర్మాణం, లే అవుట్‌ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్‌-బీపాస్‌ను పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం ఆవిష్కరించారు. టీఎస్‌ బీ పాస్‌ ద్వారా సాంకేతిక విజ్ఞానం ఉపయోగించడంతో పౌర మైత్రిపూర్వక సేవలు అందుతాయి. సంప్రదింపులు లేకుండా, పారదర్శకత సేవలు కల్పిస్తుంది. ఒకేప్లాట్‌, స్థల అభివృద్ధి అనుమతి, ఎల్‌వోసీ కోసం ఒకే(కామన్‌) దరఖాస్తు సౌకర్యం ఉంటుంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని టీఎస్‌-బీపాస్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించి అన్‌లైన్‌లోనే అనుమతులు మంజూరుచేస్తుంది. స్థలం విస్తీర్ణాన్ని బట్టి మూడు క్యాటగిరీల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉన్నది. 75 చదరపు గజాలు (63 చదరపు మీటర్లు) వరకు ఉండే నివాసప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. ఆ ప్లాట్‌లో నిర్మించే భవనం ఎత్తు 7 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుందని ఆన్‌లైన్‌లో స్వీయధ్రువీకరణ పత్రం సమర్పిస్తేచాలు అనుమతిపత్రం జారీ అయినట్టు లెక్క. 500 చదరపు మీటర్ల వరకు, 10 మీటర్ల ఎత్తు వరకు ఉండే నివాసప్లాట్‌ ఏరియాలో దరఖాస్తుదారు స్వీయ ధ్రువీకరణ చేసిన తక్షణమే భవన నిర్మాణానికి ఆమోదం లభిస్తుంది. పదిమీటర్లు ఎత్తు మించిన అన్ని ఇతర నిర్మాణాల విషయంలో దరఖాస్తుదారుకు 21 రోజుల్లో సింగిల్‌ విండో విధానంలో ద్వారా అనుమతి లభిస్తుంది. 

నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు స్వీయధ్రువీకరణ సమర్పించిన దరఖాస్తుదారుడు నిర్మించిన భవనాలను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే సదరు భవనాన్ని నిలిపివేయడం మాత్రమే కాకుండా అవసరమైతే కూల్చివేసే అధికారం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి ఉంటుంది. దరఖాస్తుదారుడు సమర్పించిన భూవివరాలు వివాదాస్పద భూములవైనా, కోర్టు కేసుల్లో ఉన్నా, ప్రభుత్వ, ఎఫ్‌టీఎల్‌, నాలా స్థలమైనా.. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటారు.  

టీఎస్‌-బీపాస్‌ కింద లభించే సేవలు

భవన నిర్మాణ అనుమతులు, లే-అవుట్‌, స్వాధీన ధ్రువపత్రం,భూమి వినియోగ ధ్రువపత్రం, భూ వినియోగ మార్పు, ఎల్‌ఆర్‌ఎస్‌, టీడీఆర్‌ బ్యాంక్‌, ఎన్వోసీలు.

దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి?

టీఎస్‌-బీపాస్‌ వెబ్‌సైట్‌ (www.tsbpass.telangana. gov.in), టీఎస్‌-బీపాస్‌ మొబైల్‌ యాప్‌ (ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌), మీ సేవా, పౌరసేవాకేంద్రాలు.

దరఖాస్తుదారులు చేయాల్సిన పని 

టీఎస్‌-బీపాస్‌ మాన్యువల్‌ పూర్తిగా చదువుకోవాలి. నిబంధనలకు అనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ను పాటించడం, పీడీఎఫ్‌ లేదా డీసీఆర్‌ ఫార్మాట్‌లో డ్రాయింగ్‌ను తయారుచేసుకోవాలి. దస్తావేజులు సిద్ధం చేసుకున్న తరువాతే దరఖాస్తు చేసుకోవాలి.