మంగళవారం 02 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 02:32:41

బోర్లు వదిలి.. బావుల వైపు!

బోర్లు వదిలి.. బావుల వైపు!

  • సాగునీటి వసతి కోసం మారుతున్న అన్నదాత ఆలోచన
  • ఖర్చు, సమయం ఆదా
  • 12 గజాల లోతులోనే నీళ్లు
  • యంత్రాలతో బావుల తవ్వకం
  • కాళేశ్వరంతో గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు 
  • 91% విస్తీర్ణంలో 10 మీటర్లకే ఉబికి వస్తున్న గంగమ్మ
  • రిజర్వాయర్లు,చెక్‌ డ్యాంలు,చెరువుల్లోనీళ్లు ఫుల్‌ 
  • పొలాల్లో బావులు తీయడానికి మొగ్గుచూపుతున్న రైతులు

ఒకప్పుడు వ్యవసాయ బావి అంటే.. తవ్వడానికి నెలలు పట్టేది. బోర్లు వేద్దామంటే.. డబ్బు ఖర్చు ఎక్కువ.. నీళ్లు ఎంత లోతులో పడతాయో తెలియదు. బోరు ఎండిపోతే మరో బోరు వేయాల్సిందే.. ఇప్పుడు కాళేశ్వరం ఫలితం.. అడుగుల లోతుల్లోనే నీళ్లు చేతికందివస్తున్నాయి. పాతాళ గంగమ్మ ఎగిసిపడి వస్తున్నది. పొక్లెయినర్‌ పెడితే చాలు.. రెండ్రోజుల్లోనే సేద్యం బావి సిద్ధమవుతున్నది. పది పన్నెండు గజాల లోతుల్లోనే నీళ్లు వచ్చిపడుతున్నాయి. ఖర్చు కూడా చాలా తక్కువ. ఏదైనా సమస్య వస్తే కొంచెం పూడిక తీస్తే చాలు.. ఊట వస్తుంది. దీంతో రాష్ట్రంలో సేద్యం బావుల సంస్కృతి మళ్లీ మొదలైంది. 

హైదరాబాద్‌, సిద్దిపేట, జనవరి 26 (నమస్తే తెలంగాణ): బోర్లు వేసి వేసి అలసిపోయిన రైతన్న.. మళ్లీ తన పాత రోజుల్లోకి వెళ్తున్నాడు. చేతికందే లోతుల్లో భూమాత నీళ్లు అందిస్తుంటే.. వెనుకటి కాలంనాటి వ్యవసాయబావి తవ్వించుకోవడం మంచిదని భావిస్తున్నాడు. ఒకప్పుడు పొలానికి వెళ్తే.. వ్యవసాయబావి నుంచి మోట కొట్టినంతసేపు కొట్టి.. తర్వాత అలుపు వచ్చేంతవరకు ఈతకొట్టి హాయిగా ఇంటికి వచ్చేవారు. తర్వాత బోర్ల శకం వచ్చి.. వీటన్నింటినీ మాయంచేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్లీ వ్యవసాయంలోకి పాతపద్ధతులు ప్రవేశిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని.. వలసపాలనలో ధ్వంసమైన గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ జరిగింది. ఏడాది పొడుగూతా చెరువులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యాంలలో నిండుగా ఉంటున్నాయి. హరితహారంతో పచ్చదనం పరుచుకున్నది. ఫలితంగా వర్షాలు లోటులేకుండా పడుతున్నాయి. పర్యవసానంగా రాష్ట్ర విస్తీర్ణంలోని 1.02 లక్షల చదరపు కిలోమీటర్ల పరిధిలో భూమి ఉపరితలానికి 10 మీటర్ల పైన భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. వనపర్తి లాంటి జిల్లాలో 2.29 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు పంట పొలాలకు నీరు అందించడానికి బోర్లను వదిలి బావులు తవ్వడానికి మొగ్గు చూపుతున్నారు. బోర్లలో మోటర్లు, పైపులతో పోల్చుకుంటే బావుల నుంచి నీటిని తోడేందుకు తక్కువ ఖర్చు అవుతుండటంతోపాటు బావుల్లో నీటి లభ్యతపై విశ్వాసంతో మళ్లీ పాతకాలం నాటి విధానాలకు మొగ్గు చూపుతున్నారు. నాడు భూగర్భ జలాలు అడుగంటడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బోర్లు వైపు మొగ్గు చూపిన రైతులు ఇప్పుడు మళ్లీ బావుల వైపు చూస్తున్నారు.

రెండురోజుల్లోనే తవ్వకం.. 

ఒకప్పుడు కొత్త వ్యవసాయబావి తవ్వాలంటే నెలలు పట్టేది.. ప్రస్తుతం యంత్రాల సహాయంతో రెండు, మూడు రోజుల్లోనే కొత్త వ్యవసాయ బావి తయారవుతున్నది. యంత్రా ల సహాయంతో బావులు తవ్వడంతో సమ యం ఆదాతోపాటు రైతులకు త్వరగా వినియోగంలోకి వస్తున్నాయి. ఏడు నుంచి ఎనిమిది గజాల లోతుల్లోనే నీళ్లు వస్తున్నాయి. లక్ష రూపాయల్లోనే 12 గజాల వరకు బావి పూర్తి అవుతుండటంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలో కొత్త టెక్నాలజీతో వ్యవసాయ బావుల తవ్వకం జోరుగా కొనసాగుతున్నాయి. వాస్తవానికి తెలంగాణలో సిద్దిపేట చాలా ఎత్తులో ఉంటుంది. అలాంటిచోట నీళ్లు అతి తక్కువ లోతులోనే వచ్చేస్తున్నాయి. 


యంత్రాల  సహాయం 

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవుతుండటంతో మండు వేసవిలో సైతం చెరువులు కుంటలు నింపారు. వర్షాలు పుష్కలంగా కురిశాయి. ఉన్న ఊరిలోనే చేతినిండా పని దొరుకుతున్నది. వలసపోయిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రతి గుంటనూ సాగులోకి తెస్తున్నారు. ఒక బోరు వేస్తే రూ.60 వేల నుంచి రూ.     లక్ష దాకా ఖర్చు అవుతుంది. బోరు వేశాక, నీళ్లు వస్తే సరేసరి.. లేకపోతే బోరు ఖర్చు.. రైతును నిండా ముంచుతుంది. యంత్రంతో బావి తవ్వడానికి గంటకు రూ.2,800 తీసుకుంటున్నారు. ఒక బావి 12 చదరపు గజాల లోతువరకు భూమిపై నుంచి యంత్రం సహాయంతో తవ్వుకుంటున్నారు. మరింత లోతు తవ్వాలంటే బేస్‌ (ర్యాంప్‌) వేసుకొని,      మరో 10 నుంచి 12 గజాల వరకు లోతు తవ్వుకొనే అవకాశం కలుగుతుంది. కానీ.. తొలి పన్నెండు గజాల లోతులోనే నీళ్లు పడుతున్నాయి. ఇందుకు సుమారుగా 1.20 లక్షల వరకు ఖర్చు వస్తుంది.

ఇప్పటి దాకా 14 బోర్లు వేశిన.. 

నీళ్ల కోసం అరి గోస పడ్డా.. వేసిన పంటను కాపాడుకోవడానికి పడరాని కష్టం పడ్డ.. మొత్తం 14 బోర్లు వేసినా, చుక్క నీరు రాలె. పోయినేడాది గోదారి నీళ్లు మా చెరువులకు వచ్చినయి.గప్పటి నుంచి భూగర్భజలాలు పెరిగినయి. బోరు మీద నమ్మకం లేక, కొత్త బావి తవ్వుతున్న. మిషన్‌తో తొందరగా బావి అయితున్నది.

- తిరుపతి, రైతు, సిద్దన్నపేట, 

నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లా ఐదు గజాలకే నీళ్లు ఎక్కుతున్నయి..వారం రోజుల కిందట మిషిన్‌తో 12 గజాల లోతు దాకా కొత్త బావిని తవ్వించిన. 6 గజాలకే నీళ్లు పడ్డయి. ఇప్పుడు 5 గజాలకే నీళ్లు బావిలో ఎక్కుతున్నయి. ప్రతి రోజు పొలానికి నీళ్లు పెడుతున్న. నీటి ఊట బాగా పెరిగింది. చాలా సంబురంగా ఉంది. గతంలో నీళ్ల కోసం 10 బోర్లు వేసినా, చుక్క నీరు రాలె. గిప్పుడు గోదావరి జలాలు రావడంతో నీటి ఊటలు పెరుగుతున్నాయి.

- మల్లారెడ్డి, రైతు, సిద్దన్నపేట, 

నంగునూరు మండలం, సిద్దిపేట జిల్లాVIDEOS

logo