బుధవారం 03 జూన్ 2020
Telangana - May 22, 2020 , 21:43:58

వ్యవసాయ సంస్కరణల్లో సిద్దిపేట ఫస్ట్‌ ఉండాలి : మంత్రి హరీశ్‌

వ్యవసాయ సంస్కరణల్లో సిద్దిపేట ఫస్ట్‌ ఉండాలి : మంత్రి హరీశ్‌

సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ఉద్యమంలో ఫస్ట్‌, అభివృద్ధిలో ఫస్ట్‌ ఇకపై వ్యవసాయ సంస్కరణల్లో కూడా ఫస్ట్‌ ఉండాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వానాకాలం 2020 నియంత్రిత పంటల సాగుపై సిద్దిపేట జిల్లా ప్రజా ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేటలోని బైరి అంజయ్య గార్డెన్స్‌లో శుక్రవారం జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నియంత్రిత పంటల సాగుపై రైతుబంధు సమితి మండల సమన్వయ కర్తలకు, వ్యవసాయశాఖ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ... సీఎం రాష్ర్టానికి తండ్రిలా రైతుల సంక్షేమం కోసం చేపట్టిందే పంట మార్పిడి అన్నారు. రైతులను సంఘటిత శక్తిగా మార్చాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు.

యాసంగిలో మక్క, వానాకాలంలో పత్తి, వరి, పెసర, కందులు వంటి పంటలు వేద్దామన్నారు. సన్న రకాలు ప్రోత్సహించాలని, వరిగింజ 6.3 మిల్లీ మీటర్ల పొడవు ఉన్న ధాన్యానికి అంతర్జాతీయంగా డిమాండ్‌ ధర ఉందన్నారు. ఆ విత్తనాలను ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తెస్తుందన్నారు. కందుల్లో కొలంబియా రకం చాలా దిగుబడి అందిస్తుందన్నారు. పంట కాలపరిమితి తక్కువ, పంటకు రోగాలు తక్కువని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రవణ్‌, జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి, జడ్పీ చైర్మన్‌ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, హుస్నాబాద్‌, దుబ్బాక ఎమ్మెల్యేలు సతీశ్‌, సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, రఘోత్తంరెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, రైతుబంధు సమిలి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. logo