శనివారం 06 జూన్ 2020
Telangana - May 23, 2020 , 23:18:19

పాలమూరు నుంచి శ్రామిక్‌ రైలు

పాలమూరు నుంచి శ్రామిక్‌ రైలు

మహబూబ్‌నగర్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో కుటుంబాలు ఓచోట.. తాము ఓచోటు ఉంటూ దాదాపు రెండు నెలలుగా బాధ పడుతున్న వలస కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం వరమందించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు వందల కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్తూ అనేక కష్టాలు పడుతుంటే కేసీఆర్‌ సర్కారు మాత్రం వలస కార్మికులను కడుపులో పెట్టుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1750 మంది వలస కార్మికుల రైల్వే టిక్కెట్‌ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించి శనివారం రాత్రి మహబూబ్‌నగర్‌ నుంచి ప్రత్యేక శ్రామిక్‌ రైలు ఏర్పాటు చేయించి వారి స్వరాష్ట్రం ఒడిశాలోని నవపహాడ్‌కు పంపించింది. 

నారాయణపేట జిల్లాలో ఇటుక బట్టీల్లో పనిచేసే 1600 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 100 మంది, వనపర్తి జిల్లాకు చెందిన 50 మందిని కలిపి మొత్తం 1750 మంది వలస కూలీలు స్వ గ్రామాలకు తరలివెళ్లారు. మధ్యాహ్నానికే రైల్వేస్టేషన్‌కు తరలించిన వారికి భోజన వసతి కల్పించారు. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికీ చిన్న పిల్లలతో సహా ఫుడ్‌ కిట్‌ అందించింది. ప్రతి కిట్‌లోనూ బిర్యానీ ప్యాకెట్‌, బిస్కట్లు, 3 లీటర్ల మంచినీరు, చాక్‌లెట్లు, మాస్కులు, ఓఆర్‌ఎస్‌ పౌడర్‌ ఉన్నాయి.

 నారాయణపేట కలెక్టర్‌ హరిచందన ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌కు వచ్చి వలస కార్మికులతో మాట్లాడారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రెండు నెలలుగా ఒక్కో వలస కార్మికునికి నెలకు రూ.500తోపాటు 12 కేజీల బియ్యం అందించిన సర్కారు ఇప్పుడు స్వస్థలాకు వెళ్తామంటే అన్ని ఖర్చులూ భరించి పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటోంది. ఇన్నాళ్లు కుటుంబాలకు దూరంగా ఉన్న వలస కార్మికులంతా తెలంగాణ ప్రభుత్వం తమకు అందించిన ఆపన్న హస్తానికి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపారు. నవపహాడ్‌ వెళ్లే ఈ రైలు ఎక్కడా ఆగకుండా ఆదివారం ఉదయం 10 గంటల్లోగా గమ్య స్థానాలకు చేరుతుందని అధికారులు తెలిపారు. logo