సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 04, 2020 , 20:24:24

పర్యాటకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

పర్యాటకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: రాష్ర్టానికి వచ్చే స్వదేశీ, విదేశీ పర్యాటకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని రాష్ట్ర అబ్కారీ, పర్యాటక శాఖామంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. ఇవాళ రవీంద్ర భారతిలో మంత్రి పర్యాటక, హెరిటేజ్‌ తెలంగాణ శాఖల అధికారులతో కరోనా వైరస్‌కు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలోని పర్యాటక ప్రదేశాలకు వచ్చే ఇతర రాష్ట్ర పర్యాటకులు, విదేశీ పర్యాటకులకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతివ్వాలన్నారు. వారికి మాస్క్‌లు, శానిటైజర్‌లను అందించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్‌పోర్టులో స్క్రీనింగ్‌ టెస్టుల అనంతరం.. వారిని అనుమతించాలన్నారు. కరోనా వైరస్‌పై రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు టూరిజం బస్సుల్లో, బోటింగ్‌ ప్రదేశాలలో, హరిత హోటల్స్‌లో, టూరిజం సమాచారం కేంద్రాల వద్ద అవగాహన కల్పించడంతో పాటు, కరపత్రాలు అందించాలన్నారు.

తెలంగాణలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని మంత్రి తెలిపారు. పలు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను దగ్గరికి కూడా రాకుండా చేయొచ్చన్నారు. ప్రజలు వదంతులు నమ్మి, ఆందోళన పడవద్దని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా పట్ల నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. నగరంలోకి వైరస్‌ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. చదువుకున్న వారు సామాన్యులకు ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ప్రజలు రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు, తప్పకుండా మాస్క్‌లు ధరించాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వ్యాధికి దూరంగా ఉండొచ్చని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు, పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌, హెరిటేజ్‌ తెలంగాణ మాజీ డైరెక్టర్‌ విశాలక్షి, సహాయ సంచాలకులు నారాయణ, మాధవి, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.  


logo