బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 19, 2020 , 17:41:50

పల్లె ప్రగతికి సిద్ధం కావాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

పల్లె ప్రగతికి సిద్ధం కావాలి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

నిర్మ‌ల్ : ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న మూడో విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణకు అధికారులు, ప్ర‌జా ప్ర‌తినిదులు సిద్ధం కావాలని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ నిర్మ‌ల్ ప‌ట్ణణంలో ఏర్పాటు చేసిన పంచాయతీ సమ్మేళనంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంపై  ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహణ, విధులపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కర్తవ్య బోధ చేశారు. 

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ... గ్రామాలను పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తిర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందేలా స‌మిష్టిగా ప‌ని చేయాల‌ని మంత్రి అధికారులకు సూచించారు. స్వచ్ఛమైన, పరిశుభ్రమైన  గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. నూతన పంచాయతీ రాజ్‌ చట్టం రూపొందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని మంత్రి వివ‌రించారు.

ప‌ల్లెల‌కు అవసరమైన సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ట్రాక్టర్ల కొనుగోలు పూర్తి చేయాలని, వైకుంఠ ధామాలు తప్పనిసరిగా నిర్మించాలని ఆదేశించారు. వర్షాకాలం నాటికి హరితహారం మొక్కలు సిద్ధం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ప‌ట్ల అల‌స‌త్వం ప‌నికిరాద‌ని, నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని మంత్రి హెచ్చ‌రికలు జారీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ విజ‌య‌ల‌క్ష్మి, ఎమ్మెల్యేలు విఠ‌ల్ రెడ్డి, రేఖా శ్యాంనాయ‌క్, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ, అద‌న‌పు క‌లెక్ట‌ర్ భాస్క‌ర రావు,  జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు, స‌ర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo