బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 02:42:59

రాళ్లెత్తే కూలీలేరి!

రాళ్లెత్తే కూలీలేరి!

  • రాష్ట్రంలో నిర్మాణ పనులకు కార్మికుల కొరత
  • ఉత్తరాది కూలీలు వాపస్‌ పోయిన ఫలితం
  • నిర్మాణాలు 3 నెలలు ఆలస్యం 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భవన నిర్మాణరంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. బతుకు భయం, కుటుంబంపై బెంగతో భవన కార్మికులు సొంతూర్లకు వెళ్లిపోవడం వల్ల నిర్మాణ పనులకు విఘాతం ఏర్పడుతున్నది. హైదరాబాద్‌లో నిర్మాణ పనులకు దాదాపు రెండు, మూడునెలలు బ్రేక్‌ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌ నిర్మాణరంగంలో లాక్‌డౌన్‌ నాటికి దాదాపు లక్షన్నర మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 30 వేలమంది ఇప్పటికే హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోయారు. లాక్‌డౌన్‌లో భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వ సూచనతో నగర నిర్మాణ సంస్థలు అన్ని వసతులు కల్పించాయి. కానీ, ఇంటిపై బెంగతో ప్రత్యేక రైళ్లలో కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ‘సాధారణంగా ప్రతి ఏప్రిల్‌, మే నెలల్లో కార్మికులు సొంతూళ్లకు వెళ్లి మళ్లీ జూన్‌లో తిరిగొస్తుంటారు. కొందరు వెళ్లినా మిగతావారు ఇక్కడే ఉండటం వల్ల పనులు ఆగిపోవు. ఇప్పుడు కరోనాతో ఎక్కువమంది కార్మికులు వెళ్లిపోతున్నారు’ అని క్రెడాయ్‌ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి తెలిపారు. కొన్ని బడా లేబర్‌ కాంట్రాక్టు సంస్థలు కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం, సకాలంలో ఆహారం పెట్టకపోవడం వల్లే వారిలో భయం ఏర్పడిందని పేర్కొన్నారు. ‘కష్టకాలంలో ప్రభుత్వానికి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం హైదరాబాద్‌ నిర్మాణరంగం రూ.70 కోట్లు ఖర్చుచేసింది. అయినా ఇంటిమీద బెంగతోనే కూలీలు వెళ్లిపోయారు’ అని క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 


భయపెడుతున్న సిమెంటు ధరలు 

లాక్‌డౌన్‌ తర్వాత నిర్మాణ సామగ్రి ధరలు అనూహ్యంగా పెరుగడంతో హైదరాబాద్‌ రియల్‌రంగంపై పెనుభారం పడుతున్నదని నిర్మాణ సంఘాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. నిన్నటివరకూ బస్తా సిమెంటు రూ.230 నుంచి 240 ఉండేదని, ఇప్పుడు రూ.370 నుంచి రూ.400 పెరిగిందని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. ఊహించినదానికంటే ఎక్కువ ధర పెరుగడంతో నిర్మాణాలు నిలిపివేయడం తప్ప గత్యంతరంలేదని అంటున్నాయి. రంగుల పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, పెయింటర్ల ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ఇండియన్‌ పెయింట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మహేశ్‌ ఆనంద్‌ తెలిపారు. 

యువతా.. అవకాశం అందిపుచ్చుకో

బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, కోల్‌కతా తదితర రాష్ట్రాలకు చెందిన నైపుణ్యం గల భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ నుంచి వెళ్లిపోవడంతో స్థానిక యువతకు ఇది చక్కటి అవకాశమని నగర నిర్మాణసంస్థలు అంటున్నాయి. ‘హైదరాబాద్‌ నిర్మాణరంగంలో కాంక్రీటు, మేసన్‌, ప్లాస్టరింగ్‌, పెయింటింగ్‌, ఎలక్ట్రికల్‌, ఫ్లోరింగ్‌ తదితర పనుల్లో నైపణ్యమున్న కార్మికులకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృత్తి నైపుణ్యాన్ని బట్టి ఒక్కొక్కరు నెలకు రూ.30 వేల నుంచి 50 వేల దాకా సంపాదిస్తారు’ అని ఎస్‌మ్మార్‌ గ్రూప్‌ చైర్మన్‌ సాయిరెడ్డి రాంరెడ్డి తెలిపారు. గల్ఫ్‌ వెళ్లిన తెలంగాణ భవన నిర్మాణ కార్మికులు తిరిగొస్తే ఇక్కడేఉపాధి లభిస్తుందని చెప్పారు.logo