శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 10:53:24

పల్లె ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ

పల్లె ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ

హైదరాబాద్‌ : బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం పల్లె ప్రగతిప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌ చర్చను ప్రారంబించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర గ్రామీణా విధానాన్ని అమలుచేస్తుందన్నారు. తెలంగాణ పల్లెల్లో పచ్చదనం, పరిశ్రుభత వెల్లివిరియాలని ప్రణాళికబద్దంగా గ్రామాలు అభివృద్ధి చెందాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చడానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అందులో భాగంగా రెండు విడుతలుగా గ్రామాల్లో పల్లె ప్రగతి ప్రత్యేక అవగాహన, చైతన్య కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. గ్రామాల వికాసానికి ప్రభుత్వం దశలవారీగా ప్రయత్నం చేస్తుందన్నారు. మొదటిదశలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు జీవన భద్రత కల్పించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడం, చేతి వృత్తులు, కుల వృత్తులకు అవసరమైన చేయూత అందించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడం, రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌, రుణమాఫీ వంటి రైతు సంక్షేమ పథకాలు, ఆసరా పెన్షన్లలాంటి ప్రజా సంక్షేమ పథకాలతో గ్రామీణ జీవనాన్ని ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సీఎం తెలిపారు.


logo