శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 12:32:07

కేంద్ర విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కు ఇబ్బందులు : మ‌ంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

కేంద్ర విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కు ఇబ్బందులు : మ‌ంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

హైద‌రాబాద్ : ‌కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌స్తున్న విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కు ఇబ్బందులు క‌లుగుతాయ‌ని రాష్ర్ట విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతి, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యుత్ సవరణ బిల్లు, శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై శాస‌న‌స‌భ‌లో మంత్రి స్వ‌ల్ప కాలిక చ‌ర్చ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టాల‌ను సంప్రందించాకే కేంద్రం నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సూచించారు. విద్యుత్ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయ‌డం స‌మాఖ్య స్ఫూర్తికి విఘాత‌మ‌ని చెప్పారు. కొత్త విద్యుత్ చ‌ట్టంతో అన్ని వ్య‌వసాయ పంపు సెట్ల‌కు మీట‌ర్లు బిగించాల్సి వ‌స్తోంది. మీట‌ర్ల త‌యారీ వ్య‌యం డిస్కంల‌కు అద‌న‌పు భారంగా మార‌నుంద‌ని తెలిపారు. కొత్త విద్యుత్ చ‌ట్టం ప్ర‌కారం టారిఫ్ విధానం మారుతుంద‌న్నారు.

పేద‌లు, వెనుక‌బ‌డిన వ‌ర్గాలు పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి వ‌స్తుంద‌న్నారు. ఈ చ‌ట్టంతో థ‌ర్మ‌ల్ విద్యుత్ వినియోగం త‌గ్గుంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఎక్క‌డి నుంచైనా విద్యుత్ తీసుకునేందుకు కొత్త చ‌ట్టం అవ‌కాశం ఇస్తోంది. క్రాస్ స‌బ్సిడీ అమ‌లు చేస్తున్న తెలంగాణ‌కు ఇదంతా పెద్ద భార‌మ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. కేంద్రం ప్ర‌తిపాదించే కొత్త చ‌ట్టం వ‌ల్ల గ్రిడ్ నిర్వ‌హ‌ణ భారం పెరుగుతుంద‌న్నారు. కొత్త చ‌ట్టం మేర‌కు లైసెన్స్ ఉన్న సంస్థ‌లు ఎక్క‌డైనా విద్యుత్ కొని ఎవ‌రికైనా అమ్మ‌వ‌చ్చు. మొత్తంగా కేంద్రం తీసుకువ‌చ్చే కొత్త విద్యుత్ చ‌ట్టంతో రైతుల‌కే కాకుండా, ప‌రిశ్ర‌మల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ర్టంలో విద్యుత్ రంగంలో అనేక‌మైన విజ‌యాలు సాధించాం. అన్ని రంగాల‌కు నాణ్య‌మైన 24 గంట‌ల విద్యుత్‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. నాడు క‌రెంట్ కోత‌లు, ప‌వ‌ర్ హాలిడేలు ఉండేవి. తెలంగాణ ఏర్ప‌డిన త‌ర్వాత మిగులు విద్యుత్ రాష్ర్టంగా మారింది. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో మ‌న రాష్ర్ట‌మే టాప్‌లో ఉంద‌న్నారు. దేశంలో అత్య‌ధిక విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. త‌ల‌స‌రి విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ర్టం ఏర్ప‌డ్డాక విద్యుత్ ఉద్యోగుల‌కు రెండు సార్లు వేత‌నాలు పెంచామ‌ని గుర్తు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్ర‌భుత్వం రూ. 10 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తోంద‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఉర్తు చేశారు. 

శ్రీశైలం విద్యుత్ ప్లాంట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని మంత్రి అన్నారు. కంట్రోల్ ప్యానల్స్ లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో విధుల్లో ఉన్న సిబ్బంది మంట‌ల‌ను ఆర్పివేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ ఫ‌లించ‌లేదు. మొత్తం 35 మంది ఉద్యోగుల్లో 29 మంది ట‌న్నెల్స్ ద్వారా బ‌య‌ట‌కు రాగ‌లిగారు. అగ్నిప్ర‌మాదం వ‌ల్ల ద‌ట్ట‌మైన పొగ ఆవ‌రించ‌డంతో.. 9 మంది విగ‌త‌జీవుల‌య్యారు. ఉద్యోగుల త్యాగం వెల‌క‌ట్ట‌లేనిది అని మంత్రి అన్నారు. ఉద్యోగుల కుటుంబానికి క‌లిగిన న‌ష్టం పూడ్చ‌లేనిది. వారి కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని తెలిపారు. మ‌ర‌ణించిన ఏడుగురు కుటుంబాల్లో అర్హులైన వారికి ఉద్యోగం క‌ల్పించేలా చూడాల‌ని జెన్‌కోకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. శ్రీశైలం ప్ర‌మాదంపై సీఐడీ విచార‌ణ‌కు ఆదేశించామ‌ని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి తెలిపారు.  


logo