మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 19, 2020 , 01:30:14

భూములకు రక్షణ కవచం

భూములకు రక్షణ కవచం

  • ప్రజలకు చేరువైన రెవెన్యూ సేవలు  l భూకబ్జాదారుల ఆటలకు అడ్డుకట్ట
  • ‘నమస్తే తెలంగాణ’తో రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఉజ్జిని సురేందర్‌రావు

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ధరణి పోర్టల్‌ వ్యవసాయ భూములతోపాటు ప్రభుత్వ భూములకు రక్షణ కవచంలా నిలుస్తుందని రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ ఉజ్జిని సురేందర్‌రావు పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ ఆవశ్యకతపై బుధవారం ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడిన ఆయన ధరణితో రెవెన్యూ సేవలు ప్రజలకు దగ్గరయ్యా యని తెలిపారు. మరిన్ని ఆసక్తికర అంశాలు ఆయన మాటల్లోనే..

ధరణి ఒప్పుకోదు..

క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం, అవినీతి కారణంగా గతంలో ప్రైవేటు భూముల పక్కన ఉన్న ప్రభుత్వ భూములను బై సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్‌ చేసి క్రయవిక్రయాలు చేసేవారు. ఎండోమెంట్‌, వక్ఫ్‌, భూదాన్‌ వంటి భూముల క్రయవిక్రయాలు కూడా జరిగేవి. ఇకపై ఇలా జరుగడానికి అవకాశమే లేదు. ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు ధరణి ఒప్పుకోదు. మొన్నటివరకు ప్రైవేటు భూములతోపాటు ఎండోమెంట్‌, వక్ఫ్‌, భూదాన్‌ భూముల్లో రియాల్టర్లు, కబ్జాదారులు లే అవుట్లు వేసి అమాయక ప్రజలకు విక్రయించేవారు. అనంతరం ఇవి ప్రభుత్వ భూములంటూ అధికారులు బోర్డులు పాతేవారు. దీంతో రూ.లక్షలు పోసి కొన్న భూమి వివాదాల పాలయ్యేది. కానీ ఇక నుంచి ఇలాంటి భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. కనుక రైతులతోపాటు ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసేవారికి కూడా మేలు జరుగుతుంది. టైటిల్‌ గ్యారంటీ లభిస్తుంది.

చేరువైన సేవలు..

నేను మంచిర్యాల జిల్లాలో జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు జిల్లా మొత్తం కేవలం 2 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు మాత్రమే ఉండేవి. వ్యవసాయ భూములతోపాటు ఇండ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు కూడా అక్కడే జరిగేవి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు డాక్యుమెంట్‌ తయారీలో, రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా ఆ రోజు రిజిస్ట్రేషన్‌ వాయిదా పడినట్టే. కానీ ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలోని సుమారు 16 తాసిల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు రిజిస్ట్రేషన్‌ సేవలు చేరువ కావడంతోపాటు కేవలం 15 నిముషాల్లోనే రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌, పట్టాదార్‌ పాసుపుస్తకం అందుతుండటం శుభ పరిణామం.

కబ్జాదారుల ఆటలు సాగవు

హైదరాబాద్‌ నగర శివారులోని భూముల్లో గతంలోనే ప్లాట్లు చేసి ఇతరులకు విక్రయించిన తర్వాత ఏదో ఆర్డర్‌ తెచ్చి మళ్లీ కబ్జాలోకి వచ్చేవారు. ప్రస్తుతం ల్యాండ్‌ కన్వర్షన్‌ కూడా వెంటనే అవుతుండటంతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశమే లేదు. క్షేత్రస్థాయిలో అవినీతి అధికారుల కారణంగా గతంలో రెవెన్యూ రికార్డులలో మార్పులు, చేర్పులు జరిగేవి. కానీ ధరణి ఫోర్టల్‌ పూర్తిగా ట్యాంపర్‌ ప్రూఫ్‌ కాబట్టి ఎలాంటి మార్పులు చేయలేరు. దీనిద్వారా భూ వివాదాలు, కోర్టు కేసులు తగ్గుతాయి. గతంలో ఎమ్మార్వో ఇచ్చిన ఆర్డర్లపై ఆర్డీవో అప్పిలేట్‌ తర్వాత రివిజన్‌ కోసం జేసీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. దీంతో పరిష్కారం సంగతి అటుంచితే వివాదాలు మరింత పెరిగేవి. పట్టణాల్లోని ప్రజలకు ఏ మేరకు మేలు చేస్తాయనే అంశాన్ని పక్కన పెడితే మారుమూల గ్రామాల్లోని రైతులకు ఇదొక వరం. ధరణి రావడానికి ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకు మ్యుటేషన్లు చేసుకొనేందుకు అవకాశం కల్పించాలి. గతంలో జారీచేసిన పట్టాదార్‌ పాసుపుస్తకాలలో భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, పేర్లలో పదదోషాలు వచ్చిన వాటిని సవరించుకొనే వెసులుబాటు కల్పించాలి.

తిరుగుడు అవసరమే లేదు

మాది గొల్లపల్లి మండలంలోని వెనుగుమట్ల. గ్రామ శివారులో ఎకరం 32 గుంటల భూమి కొన్నా. మీ సేవకు పోయి స్లాట్‌ బుక్‌ చేసుకొన్న. తాసిల్దార్‌ ఆఫీసుకు పోయిన అద్దగంటల్నే పనైంది. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ కోసం తాలూకా కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. మస్తు తిరుగుడయ్యేది. ఇప్పుడు ఎక్కడికీ తిరుగుడు అవసరం లేకుంట మండలంలనే రిజిస్ట్రేషన్లు పెట్టి మంచి పనిచేసిన్రు. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కూడా చేసి ఇస్తున్నరు. చాలా సంతోషం. 

- సిరికొండ చిలుకయ్య, వెనుగుమట్ల, జగిత్యాల