గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 14, 2021 , 02:14:05

రుణం ఉంచుకోరు!

రుణం ఉంచుకోరు!

  • అప్పుల చెల్లింపులో ఎస్‌హెచ్‌జీలే టాప్‌
  • దేశానికి ఆదర్శంగా తెలంగాణ మహిళలు
  • రాష్ట్రంలో 98 శాతం బకాయిల చెల్లింపు

హైదరాబాద్‌, జనవరి 13 ( నమస్తే తెలంగాణ ): కరోనా లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. పనుల్లేక ఉపాధి కరువైంది. అయినప్పటికీ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో తెలంగాణ స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) ముందే ఉన్నాయి. 98 శాతం చెల్లింపులతో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి. కరోనా కాలంలోనూ మహిళా సంఘాల కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం పడొద్దని సెర్ప్‌ అధికారులు బ్యాంకుల ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎస్‌హెచ్‌జీ మహిళల రుణాల తిరిగి చెల్లింపులు 91 శాతం ఉండగా, సెర్ప్‌ అధికారులు ప్రణాళికతో 7 శాతం పెరిగాయి. రుణాలు తీసుకొని క్రమం తప్పకుండా తిరిగి చెల్లిస్తే బ్యాంకులు మరిన్ని రుణాలు ఇస్తున్నాయి. దీంతో మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు రుణాలు తిరిగి చెల్లించడానికి మొగ్గు చూపుతున్నాయి. 

సెర్ప్‌ ప్రణాళికలు

సెర్ప్‌ అధికారులు నిత్యం మహిళా సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి కార్యకలాపాలు చురుకుగా నడిపిస్తున్నారు. మహిళా సంఘాలు ఉత్పాదకరంగాలపై దృష్టిపెట్టించడంలో సఫలమయ్యారు. దీంతో మహిళల ఆర్థికశక్తి పెరిగింది. రుణాలు తిరిగి చెల్లించే సామర్థ్యం పెరిగింది. కరోనా సమయంలో దేశంలో అనేక రంగాలవారు, సంస్థలు రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో దాదాపు 14 శాతానికిపైగా ఎన్‌పీఏలు ఉంటాయని బ్యాకింగ్‌ అధికారులు అంచనా వేశారు. కానీ, మహిళా సంఘాలు మాత్రం కరోనాతో సంబంధం లేకుండా రుణాల చెల్లిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి, మంచిర్యాల జిల్లాల్లో ఇంకా 0.89 శాతం రుణాలే తిరిగి చెల్లించాల్సి ఉన్నది. వివిధ కారణాలతో గిరిజన జిల్లాల్లో రిపేమెంట్‌ శాతం మిగిలిన జిల్లాల కంటే కొంచెం తక్కువగా ఉన్నది. 

3.99 లక్షలు : రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలు

43.29 లక్షలు : మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులు

రూ.  6,500 కోట్లు : గత ఏడాది ఎస్‌హెచ్‌జీలు పొందిన రుణాలు


logo