శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 00:37:42

అనాథ పిల్లలకు ఆశ్రయం

అనాథ పిల్లలకు ఆశ్రయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బాలికలపై దాడులను దృష్టిలో ఉంచుకొని అనాథ పిల్లలకు ప్రైవేటులో కాకుండా ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం కల్పించేందుకు చర్యలు చేపట్టాలని గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్‌ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ పాలనలో మహిళలు, శిశువుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, వారిపై దాడులకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇటీవల అమీన్‌పూర్‌లో బాలిక మృతి ఘటన, తనపై 139 మంది లైంగికదాడికి పాల్పడ్డారని ఓ యువతి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు, మహిళలపై దాడులు జరిగితే వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై మంత్రి శనివారం జిల్లాల అధికారులతో వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. హైదరాబాద్‌ శివార్లలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలపై తనిఖీల తీరు, వారు గుర్తించిన అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం సత్యవతి మాట్లాడుతూ.. ఆయా కుటుంబాలు తమ పిల్లలను అనాథ ఆశ్రమాలకు పంపేందుకు గల కారణాలు, వారికి ఉన్న ఇబ్బందులను గుర్తించాలని సూచించారు. ఎవరూ లేని అనాథ పిల్లలను ఆరేండ్లు దాటితే గురుకులాల్లో చేర్చి సంరక్షించాలని, ఆరేండ్లలోపు వారయితే అంగన్‌వాడీల ద్వారా సహకారం అందించాలని చెప్పారు. సామాజిక సేవ పేరుతో పిల్లలను, మహిళలను ఆశ్రమాల్లో ఇబ్బందులు పెడితే వెంటనే వాటిని మూసివేయాలని ఆదేశించారు. వచ్చే నెలను పోషణ మాసంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, తల్లుల ఆరోగ్యంపై మరింత శ్రద్ధపెట్టాలని పేర్కొన్నారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో స్థానిక అంగన్‌వాడీ అధికారి ఫోన్‌ నంబర్లతోపాటు పోలీసు, రెవెన్యూ అధికారుల నంబర్లు కూడా బోర్డుపై రాయించాలన్నారు. 

ఆయా కుటుంబాన్ని ఆదుకోండి

విధి నిర్వహణలో వైరస్‌ బారినపడి మరణించిన వరంగల్‌ జిల్లా అర్బన్‌ ప్రాజెక్టు పరిధిలోని మట్టెవాడలో అంగన్‌వాడీ ఆయా సిరిసిల్ల నిర్మల కుటుంబాన్ని ఆదుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ను అంగన్‌వాడీ యూనియన్‌ కోరింది. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, ఆయా కుటుంబసభ్యులు శనివారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. న్యాయం జరిగేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు.


logo