ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 24, 2020 , 03:03:39

ఉపాధిలో గొర్ల హాస్టళ్లు

ఉపాధిలో గొర్ల హాస్టళ్లు

 • దేశంలోనే తొలిసారిగా ఇబ్రహీంపూర్‌లో.. 
 • సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం
 • మూడేండ్ల కిందటే నరేగాకు నయా ఊతం
 • చొరువ చూపిన మంత్రి హరీశ్‌రావు 
 • అదేబాటలో మరో ఎనిమిది ఊర్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పలుగు, పార చేతపట్టడం.. రెండు గుంతలు తవ్వడం.. ఆపై పూడ్చడం.. కూలీలకు ఉపాధి కల్పించామంటూ రికార్డుల్లో నమోదు చేసుకోవడం. దేశవ్యాప్తంగా పద్నాలుగేండ్ల జాతీయ ఉపాధి హామీ (నరేగా) ప్రస్థానమిది. ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా.. ఒక్క నిర్మాణాత్మక పనీ చేపట్టింది లేదు. కానీ మూడేండ్ల కిందటే ఆ దిశగా విజయవంతంగా అడుగులేసింది సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని ఇబ్రహీంపూర్‌ గ్రామం. నరేగా నిధులతో తొలిసారిగా సామూహిక గొర్రెల షెడ్ల నిర్మాణం చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆర్థికమంత్రి హరీశ్‌రావు చొరువతో విజయవంతమైన ఈ సంకల్పాన్ని మరో ఎనిమిది గ్రామాలు కూడా చేపట్టాయి. 

గొర్ల కోసం సామూహిక షెడ్లు

గ్రామాల్లో గొర్రెల మందలను కాపరులు ఉదయాన్నే సమీపంలోని బీడు భూములు, గుట్టల్లోకి మేత కోసం తోలుకెళుతుంటారు. రాత్రివేళల్లో ఇండ్లవద్దే ఏర్పాటుచేసుకున్న చిన్నపాటి దొడ్లలో ఉంచుతారు. ఆ సమయంలో కాలుష్యపరంగా, ఆరోగ్యపరంగా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటున్నాయి. చూడటానికి చిన్నగానే కనిపిస్తున్నా.. తీవ్రంగానూ పరిగణించాల్సి వస్తున్నది. గొర్రెలకు తరుచుగా సోకే  గాలికుంటువ్యాధితో మనుషులకూ  ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమా దముంది. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రామ శివార్లలో గొర్రెల మందల కోసం నరేగా నిధుల కింద ‘సామూహిక గొర్రెల షెడ్లు’ నిర్మిస్తున్నారు. రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని ముందుకుతీసుకెళ్లారు. 2017-18 జాతీ య ఉపాధి హామీ పథకం నిధుల నుంచి 90 శాతం, గొర్రెల యజమానుల కంట్రిబ్యూషన్‌ 10శాతం వాటా కింద షెడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.45 వేల వరకు వెచ్చించారు. ఇలా ఒకే ప్రాగంణంలో సుమా రు రూ.20.70 లక్షలతో 46 షెడ్ల నిర్మాణాన్ని చేపట్టి ‘గొర్రెల హాస్టల్‌'గా రూపొందించారు.


చిన్న ప్రయత్నం.. ప్రయోజనాలు బహుముఖం

 • నరేగా కింద శాశ్వత నిర్మాణాలు.
 • గొర్ల మందలు గ్రామంలోకి రాకపోవడంతో రోడ్లపై దుమ్ముధూళి సమస్య తీరింది. రోడ్లపై గొర్లమల, మూత్ర విసర్జన ఆగడంతో ప్రజలకు డయేరియా వంటి వ్యాధులు దూరమయ్యాయి.
 • గ్రామంలో రోడ్లకిరువైపుల నాటిన హ రితహారం మొక్కలకు రక్షణ కలిగింది.
 • గొర్రెలకు రోగమొస్తే కాపరులు వ్యయ ప్రయాసలకోర్చి వాటిని మండలకేంద్రంలోని పశు వైద్యశాలకు తీసుకెళ్లాల్సి వచ్చేది. కానీ, నిత్యం ఉదయం 8 గం టలకు పశువైద్యుడు సామూహిక షెడ్డు వద్దకు వచ్చి గొర్రెలను పరీక్షిస్తున్నారు. 
 • చుట్టూ రక్షణ వలయంతో షెడ్లు, సోలా ర్‌ పలకల ద్వారా రాత్రివేళల్లోనూ వెలుగులు, చుట్టూ ప్రహరీ ఉండటంతో తోడేళ్లు, ఇతరత్రా ప్రమాదాల నుంచి ఆ మూగజీవాలకు రక్షణ కలిగింది. 
 • ఇంటివద్ద ప్రతిమంద వద్ద రాత్రిపూట ఒకరిద్దరు కాపలా ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు అన్నిమందలు ఒకే ప్రాంగణంలో ఉండటంతో రోజుకొకరు చొప్పున కాపలాగా ఉంటున్నారు.
 • వేల గొర్రెల పెంటను ఒకేచోట ప్రాంగణంలో నిర్మించిన కంపోస్టు పిట్‌ (గుంత)లో వేయడంతో పెద్దమొత్తంలో సేం ద్రియ ఎరువు తయారవుతున్నది. 

షెడ్లతో అన్ని తిప్పలు పోయినయ్‌

గ్రామాన్ని దత్తత తీసుకున్న మంత్రి హరీశ్‌రావు పట్టుబట్టి మరీ మా గొల్ల కురుమల కోసం గొర్రెల షెడ్లు కట్టిచ్చిండ్రు. ఇవి లేనపుడు ప్రతి దానికీ తిప్పలయ్యేది. షెడ్లు కట్టడంతోటి గొర్రెలకు, మాకు మంచిగైంది. ఊర్ల కూడా గతంలో కోపం పడెటోళ్లు. ఇప్పుడు ఆ బాధలు లేవు. 

-ఎల్‌ బుచ్చయ్య, ఇబ్రహీంపూర్‌

ఊర్ల శుభ్రంగ ఉంటున్నం

గతంలో మేం చాలా ఇబ్బందులు పడెటోళ్లం. ఇప్పు డు ఊరి బయట షెడ్డు ఉండటం వల్ల ఇంటిదగ్గర వాసన, దోమలు, ఈగల సమస్య లేకుండాపోయింది. దొడ్లల్ల ఉంచినపుడు ఎప్పుడు ఏమొచ్చి గొర్రెల మీద పడుతుందోనన్న భయం ఉండేది. ఇప్పుడు షెడ్ల వల్ల ఆ భయం లేకుండాపోయింది. 

- వంక ఐలయ్య, ఇబ్రహీంపూర్‌

హాయిగా నిద్రపోతున్నం

గతంల పొద్దులేదు.. మాపు లేదు.. గొర్లను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు షెడ్లల్ల భద్రంగా ఉంటున్నయి. సీసీ కెమెరాలు, సోలార్‌ లైట్లతో మంచి సౌలతులు ఉన్నయి. షెడ్లు కట్టిచ్చినప్పటి నుంచి ఇండ్లల్ల హాయిగ నిద్రపోతున్నం. 

- పయ్యావుల కొమరయ్య, ఇబ్రహీంపూర్‌


logo