హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ కీర్తి కిరీటంలోకి మరో విద్యాసంస్థ చేరబోతున్నది. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి ట్రస్ట్-ఢిల్లీ ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి సంస్థ (సిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ట్రస్ట్ చైర్మన్, లాల్ బహదూర్‌శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి ముందుకొచ్చారు. అనిల్ శాస్త్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ మంగళవారం బీఆర్కేభవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ స్థాపనకు సహకారం అందిస్తామని సీఎస్ చెప్పారు. యువతకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణతోపాటు వివిధ కోర్సులను ఈ సంస్థ నిర్వహించనున్నదని అనిల్ శాస్త్రి తెలిపారు. సంస్థ స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. చర్చల అనంతరం హైదరాబాద్‌లో సంస్థను నెలకొల్పేందుకు అనిల్ శాస్త్రి ముందుకొచ్చారని వినోద్‌కుమార్ తెలిపారు. సింగపూర్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో కలిసి నైపుణ్యాభివృద్ధి సంస్థ ను ఏర్పాటుచేస్తామని ట్రస్ట్ డైరెక్టర్ శ్రీవాస్తవ చెప్పారు. సమావేశంలో ట్రస్ట్ సలహాదారు పాండురెడ్డి పాల్గొన్నారు.