భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలం రామయ్య సన్నిధిలో దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిదో రోజు మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చనలు జరుగనున్నాయి. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. శుక్రవారం నిజరూప అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. రేపు సాయంత్రం దసరా మండపంలో శమీ పూజ, ఆయుధ పూజ నిర్వహిస్తారు. అదేవిధంగా శ్రీరామలీలా మహోత్సవం జరుగనుంది.