మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:31:05

అవినీతి మరక.. చావుకేక

అవినీతి మరక.. చావుకేక

  • చివరకు మిగిలేది ఆవేదనే
  • అక్రమ సంపాదనతో చిక్కులు
  • నిన్న కీసర మాజీ తాసిల్దార్‌ నాగరాజు..
  • మొన్న షేక్‌పేట్‌ తాసిల్దార్‌ భర్త ఆత్మహత్య
  • ఒంటరవుతున్న బాధిత కుటుంబాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లంచం.. లంచం.. ఎదుటివారిని వేధించి, బాధించి అక్ర మంగా కొందరు అధికారులు కోట్లు కూడబెడుతున్నారు. అవినీతి బాగోతం బయటపడ్డాక పరువుపోయి మనోవేదనతో మృత్యుమార్గం వెతుకుతున్నారు. బాధిత కుటుంబాలకు వ్యధ ను మిగులుస్తున్నారు. బతికున్నప్పుడు వారిచ్చిన సంపాదనేదీ కుటుంబసభ్యుల జీవితాల్లో సంతోషాలు నింపడంలేదు. పైగా సమాజం నుంచి అవమానాలు తప్పడంలేదు. మొన్న షేక్‌పేట మాజీ తాసిల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్యకు అవినీతే కారణం కాగా, నిన్న నాగరాజును మింగేసిందీ అదే భూతం.

అన్నింటికీ అవినీతే కారణం

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తాసిల్దార్‌ నాగరాజు చంచల్‌గూ డ జైలులో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. షేక్‌పేట మాజీ తాసిల్దార్‌ సుజాత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టు కాగా, ఆమె భర్తను పోలీసులు వి చారించారు. సుజాత జైలు లో ఉండగానే భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలన్నింటికీ కారణం అవినీతే. ఇలాంటి ఘటనలు చూసిన తర్వా త.. సామాన్యులను పీల్చిపిప్పిచేసి సంపాదించిన డబ్బు కంటే, వచ్చే వేతనంలో అవసరాలు తీర్చుకుంటూ దర్జాగా ఉండటమే మేలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అవినీతి సొమ్ము ను బినామీల పేరిటే ఎక్కువమంది దాస్తుంటారు. తీరా రిటైర్‌ అయ్యాక ఆ ఆస్తులను బి నామీలు వీరికి ఇవ్వని ఘటనలూ చూస్తుంటామని సీనియర్‌ అధికారి అధికారి తెలిపారు. తీరా సర్వీస్‌ పూర్తయ్యాక అనుభవిద్దాంలే అనుకున్న అవినీతి సొమ్ముపై మింగలేక.. కక్కలేక కూడా కొందరు తీవ్ర అనారోగ్యాలపాలైన ఘటనలు ఉన్నాయని చెప్పారు.

మేలుకొంటారా?

వరుస ఘటనలతోనైనా అవినీతి అధికారులు మేల్కొంటా రా? అనేది చర్చనీయాంశం. అవినీతి కట్టడికి ప్రభుత్వం చట్టాలను పకడ్బందీగా మార్చినా.. కొందరు పక్కదారులు తొక్కుతు న్నారు. విలాసాల కోసం అక్రమార్జనకు అలవాటుపడి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏసీబీకి చిక్కి జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు. నాలుగు గోడల మధ్య తీవ్ర మానసిక సంఘర్షణలో ఉండే ఇలాంటి ఖైదీలకు సరైన సమయంలో కౌన్సెలింగ్‌ ఇవ్వడం ఉత్తమ మార్గమని అంటున్నారు.


logo