బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 17, 2020 , 10:44:05

షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌ : షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యానగర్‌లో నివాసముంటున్న సుజాత భర్త అజయ్ కుమార్.. బుధవారం తెల్లవారుజామున చిక్క‌డ‌ప‌ల్లిలోని త‌న చెల్లెలు ఇంటికి వెళ్లాడు. అక్క‌డ‌ ఐదో అంత‌స్తు నుంచి కింద‌కు దూకాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన అజయ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాత అరెస్టు అయిన విషయం విదితమే. ఖ‌లీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు సుజాతపై ఆరోపణలు రావడంతో ఆమెను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఇదే కేసులో రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు త‌ర‌లించారు. ఈ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న సుజాత ప్ర‌స్తుతం రిమాండ్ లో ఉన్నారు.


ఈ కేసుకు సంబంధించి ఇటీవ‌లే సుజాతను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి పిలిపించిన అధికారులు, ఆమె నివాసంలో ప‌ట్టుబ‌డ్డ రూ.30 లక్షల డబ్బు సహా పలు అంశాలపై ఆరా తీశారు. విశ్వసనీయంగా తెలిసిన వివరాల ప్రకారం.. రూ.30 లక్షలు తన జీతం డబ్బులని సుజాత సమాధానమిచ్చినట్టు తెలిసింది. అయితే ఎన్నేండ్లుగా జీతాన్ని ఇంట్లో దాచుకుంటున్న విషయం తనకు సరిగా గుర్తు లేదంటూ ఆమె పొంతలేని సమాధానాలు చెప్పుకొచ్చారు. 

ఇదే విషయంపై సుజాత భర్తను (ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్‌ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు) ఆరా తీయగా స్థలాన్ని బంధువులకే విక్రయించినందున ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు లేవని చెప్పుకొచ్చారు. విచారణ సందర్భంగా సుజాత ఇంట్లో స్వాధీనం చేసుకున్న పలు ప్రభుత్వ డాక్యుమెంట్లపైనా అధికారులు ఆరా తీశారు. 

కేసు పూర్వ‌ప‌రాలు.. 

బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌ 14లో రూ. 50 కోట్ల విలువైన భూవివాదాన్ని పరిష్కరిస్తానంటూ ఖాలీద్‌ అనే వ్యక్తి నుంచి ఆర్‌ఐ నాగార్జున రెడ్డి రూ. 30 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటున్న ఆర్‌ఐ నాగార్జున రెడ్డి, కేసు మాఫీ చేస్తానంటూ రూ. 3 లక్షలు డిమాండ్‌ చేసిన ఎస్‌ఐ రవీంద్ర నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్ర‌మేయం ఉండొచ్చనే అనుమానంతో షేక్‌పేట తహసీల్దార్‌ సుజాతను ఏసీబీ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించారు. ఈ క్రమంలో ఆమె నివాసంలో అధికారులు సోదాలు చేయగా రూ. 30 లక్షలు, బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. 


logo