గురువారం 09 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 02:43:20

మేనకోడలిపై లైంగికదాడి

మేనకోడలిపై లైంగికదాడి

  • నిందితుడు సిటీలో పోలీస్‌ కానిస్టేబుల్‌
  • ఘటనపై సిగ్గుపడుతున్నా : సీపీ అంజనీకుమార్‌

కంటోన్మెంట్‌: ప్రజలను కాపాడాల్సిన ఓ పోలీసు ఉద్యోగి సొంత మేనకోడలిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. లాక్‌డౌన్‌ సమయంలో స్కూల్‌ లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్న ఆ బాలికను చెరబట్టాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ క్రైమ్‌ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ వరదరాజ్‌ సుదేశ్‌ ఉమేశ్‌ (33) బోయిన్‌పల్లి సిఖ్‌ విలేజ్‌లో భార్య, కూతురుతో నివాసం ఉంటున్నాడు.  లాక్‌డౌన్‌తో స్కూల్‌ లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సొంత అక్క కూతురుపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి బాలలహక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. వారు నగర అదనపు పోలీస్‌ కమిషనర్‌ శిఖాగోయల్‌కు సమాచారం ఇచ్చారు. బోయిన్‌పల్లి పోలీసులు నిందితుడిపై పోక్సో తదితర చట్టాల కింద కేసు నమోదుచేశారు. ఈ ఘటనలపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ట్విట్టర్‌లో స్పందించారు. నిందితుడు ఉమేశ్‌ను అరెస్టు చేశామని, ఘటనపై సిగ్గుపడుతున్నానని, పోలీస్‌శాఖలో ఇలాంటి వాళ్లు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా ప్రజలు మరింత ఫీడ్‌ బ్యాక్‌ను 94906 16555కి అందించాలని సూచించారు. 


logo