శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 01:56:49

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురి మృతి

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, జనవరి 24: రాష్ట్రంలో వేర్వేరు చోట్ల ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు.  నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలంలోని చిట్యాల్‌కు చెందిన దార్‌శెట్టి వినోద్‌(22) తన చిన్నాన్న కూతురిని నిర్మల్‌ బస్టాండ్‌లో దింపి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు.. మంజులాపూర్‌ బస్టాండ్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వస్తున్న టిప్పర్‌ బైక్‌ను ఢీకొట్టింది. వినోద్‌ టిప్పర్‌ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఉట్నూర్‌ ఏఎస్సై డేవిడ్‌ (55) మృతి చెందాడు. నేరడిగొండ నుంచి నిర్మల్‌కు భార్యతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కారు ఢీ కొట్టింది.  కాగా, డేవిడ్‌ భార్య గంగామణి గాయాలతో బయటపడింది.  కర్ణాటక నుంచి హైదరాబాద్‌కు గుట్కా తరలిస్తున్న ఓ వ్యాన్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద డివైడర్‌ను ఢీకొట్టడంతో  కర్ణాటకలోని బాల్కి మండలం ఉగ్లా గ్రామానికి చెందిన డ్రైవర్‌ మున్నా(21), క్లీనర్‌ శరత్‌(21) మృతిచెందారు.  పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గంగాపురికాలనీలో బైక్‌, సైకిల్‌ ఢీకొన్న ఘటనలో ఒక యువకుడు మృతిచెందాడు.  కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇందిరానగర్‌ వద్ద ఒక బైక్‌ను మరో బైకు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు ఒకరు మృతిచెందాడు.  జగిత్యాల రూరల్‌ మండలం మోరపల్లి వద్ద టాటాఏస్‌ కల్వర్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధురాలు మృతిచెందగా, పదిమంది గాయపడ్డారు.

VIDEOS

logo