బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 16:55:47

రాష్ట్రానికి కొత్తగా ఏడు ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్స్‌

రాష్ట్రానికి కొత్తగా ఏడు ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూల్స్‌

హైదరాబాద్‌ : రాష్ట్రానికి కొత్తగా ఏడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు మంజూరయ్యాయి. దీంతో 840 మంది గిరిజన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన రెసిడెన్షియల్‌ విద్య అందనుంది. ఇందులో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏటా రూ.1.09లక్షలు ఖర్చు చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 16 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 5250 మంది గిరిజనులు విద్యనభ్యసిస్తున్నారు. కొత్త స్కూళ్లతో మొత్తం విద్యాలయాల సంఖ్య 23కి చేరింది.

కొత్తగా మంజూరైన వాటిలో మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గూడూరు, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో ఒకటి, భద్రాద్రి కొత్తగూడెంజిల్లా చెర్ల, దుమ్ముగూడెం, ముల్కనపల్లి, ఖమ్మం జిల్లా సింగరేణిలో ఏర్పాటు చేయనున్నారు. పాఠశాలల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.౩౩కోట్ల చొప్పున రూ.231 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ విద్యాలయాల మంజూరుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ పాటుపడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే రెసిడెన్షియల్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఉన్నన్ని రెసెడెన్షియల్‌ విద్యాలయాలు దేశంలో ఎక్కడా లేవని చెప్పారు. తాజాగా కేంద్రం కొత్తగా మంజూరు చేసిన ఏడు విద్యాలయాలు జతకావడంతో రాష్ట్రాన్ని అక్షర తెలంగాణ మార్చడానికి తోడ్పడుతాయన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి మంత్రి సత్యవతి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా గిరిజనుల కోసం ఎక్కడా రాజీపడకుండా కేసీఆర్‌ అందిస్తున్న ప్రోత్సాహానికి గిరిజనుల పక్షాన కృతజ్ఞతలు చెప్పారు.

సీఆర్టీల రెన్యువల్‌కు ప్రభుత్వం ఆమోదం

గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా కాంట్రాక్టు రెసిడెన్షియల్‌ టీచర్స్‌(సీఆర్టీ) రెన్యువల్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నప్పటికీ 1950 మందిని రెన్యువల్ చేసేందుకు అనుమతిచ్చిందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. సీఆర్టీలు సమర్థవంతంగా పని చేసి, పేరు తీసుకురావాలని సూచించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo