సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:10

రాష్ట్రంలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

రాష్ట్రంలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ స్కూళ్లు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణలో కొత్తగా 7 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్‌) ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కొత్తగూడ, గూడూరులో, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెళ్లిలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చెర్ల, దుమ్ముగూడెం, ముల్కలపల్లిలో, ఖమ్మం జిల్లా సింగరేణిలో ఈ స్కూళ్లు ఏర్పాటుకానున్నాయి. ఇందులో తొలి ఏడాది 840 మంది విద్యార్థులు చదువుకోనున్నారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.09లక్షల చొప్పున, మొత్తంగా రూ.9.15కోట్లు ఖర్చు చేయనున్నది. కొత్తగా అనుమతించిన ఈ ఏడు స్కూళ్ల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.33కోట్ల చొప్పున మొత్తం రూ.231 కోట్లు వెచ్చించనున్నది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేజీ టు పీజీ విద్యావిధానానికి మరింత బలం చేకూరనున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 16 పాఠశాలలు కొనసాగుతుండగా అందులో 5,250 మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటి నిర్వహణకు ప్రభుత్వం ఏటా రూ.57.23కోట్లు ఖర్చుచేస్తున్నది. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో ఈఎంఆర్‌ఎస్‌ల సంఖ్య 23కు చేరనున్నది. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నిర్ణయాల వల్లే కేంద్రం కొత్తగా ఏడు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను అనుమతించిందని తెలిపారు. గిరిజనులకు అందిస్తున్న ప్రోత్సాహానికి గిరిజన వర్గాల తరఫున సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.


logo