హైవేపై రోడ్డు ప్రమాదం ఏడుగురి దుర్మరణం

- చేవెళ్లలో హైవేపై ఇన్నోవా, బోర్వెల్ లారీ ఢీ
- మృతుల్లో నాలుగేండ్ల చిన్నారి, నలుగురు మహిళలు
- తల్లిదండ్రులను కోల్పోయి బయటపడ్డ బాలుడు
- పక్షవాతం మందు కోసం కర్ణాటకకు వెళ్తుండగా ఘటన
- మృతులంతా హైదరాబాద్‌లోని కాలాపత్తర్ వాసులు
చేవెళ్ల: అప్పటివరకు తల్లి ఒడిలో నిద్రించిన ఆ చిన్నారి భారీ కుదుపునకు కండ్లు తెరిచాడు.. జోలపాడిన తల్లి, లాలించిన చెల్లి, నవ్వించిన నాన్న, ముద్దుచేసిన చుట్టాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయి ఉన్నారు.. ప్రయాణించిన వాహనం ముక్కలైంది.. చావు, బతుకు మధ్య తేడా తెలియని ఎనిమిదేండ్ల అయ్యాన్ఖాన్ బిక్కముఖం వేశాడు. తాము ప్రయాణించిన వాహనం టైరు ఊడిపడిపోతే, దానిపైనే కూర్చొని ‘అమ్మా నీకేమైంది.. లే అమ్మా. ఒక్కసారి చూడమ్మా’ అంటూ పిలిస్తే ఉలుకుపలుకు లేదు. విగతజీవిగా మారిన తల్లి మృతదేహాన్నే చూస్తూ కొయ్యబారిపోయాడు. దారినపోయేవాళ్లు ఆ దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల రోడ్డు ప్రమాదం విషాదమిది. ఇన్నోవా కారు, బోర్వెల్ బండి ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు.
ప్రమాదాలకు నిలయం
హైదరాబాద్‌లోని కాలాపత్తర్ ఠాణా పరిధిలోని మక్కాకాలనీకి చెందిన ఆసిఫ్‌ఖాన్ (46), ఫౌజియాబేగం(40) దంపతులకు ఇంటర్ చదివే, తొమ్మిదేండ్ల కుమారులతోపాటు ఎనిమిదేండ్ల అయ్యాన్ఖాన్ ఉన్నారు. ఫౌజియాబేగంకు చెల్లెళ్లు నజియా బేగం(30), హర్షియాబేగం(28) ఉన్నారు. నజియాబేగం కొంతకాలంగా పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నారు. కర్ణాటకలోని గుర్మట్కల్లో లభించే నాటు వైద్యంతో ఈ వ్యాధి నయమవుతుందని అక్కడికి వెళ్లాలని భావించారు. బుధవారం తెల్లవారుజామున ఆసిఫ్‌ఖాన్, ఫౌజియాబేగం, వీరి కొడు కు అయ్యాన్ఖాన్, నజియాబేగం (30), హర్షియాబేగం (28), ఈమె కూతురు అర్షియా(4), భర్త ఖాలెద్ అయ్యబ్(43), బంధువులు మహేక్‌సానియా(18), అన్వర్‌ఖాన్, నజియాబేగ్, తయ్యబ్బేగ్తో కలిసి ఇన్నోవా కారులో బుధవారం తెల్లవారుజామున గుర్మట్కల్కు బయలుదేరారు. మార్గమధ్యలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కందవాడ మల్కాపూర్ గేట్ సమీపంలో జాతీ య రహదారి 163పై మూలమలుపు వద్ద బోర్వెల్ లారీ, ఇన్నోవాకారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారు నడుపుతున్న ఆసిఫ్ఖాన్తోపాటు ఫౌజియాబేగం, మహేక్ సాని యా, నజియాబేగం, హర్షియాబేగం, అర్షియా, ఖాలెద్ అయ్యబ్ దుర్మరణం చెందారు. వీరిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు ఉస్మానియా దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందారు. తల్లిదండ్రులను కోల్పోయి న అయ్యాన్ఖాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవగా, ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. చేవెళ్ల సీఐ బాలకృష్ణ సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయినవారిని జేసీపీ సాయంతో బయటకు తీశారు. మృతుల కుటుంబ సభ్యులను చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు