సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 03:33:48

నారాయణపురలో ఏడుగేట్లు ఎత్తివేత

నారాయణపురలో ఏడుగేట్లు ఎత్తివేత

  • 45 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల
  • ఆల్మట్టికి స్థిరంగా కొనసాగుతున్న వరద
  • జూరాలకు పరుగులు పెడుతున్న కృష్ణమ్మ
  • ఎస్సారార్‌ నుంచి ఎల్‌ఎండీకి నీటివిడుదల

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కర్ణాటకలోని నారాయణపుర జలాశయం నుంచి అధికారులు 45 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతుండగా.. 40 వేల క్యూసెక్కుల జలాలు విడుదలవుతున్నాయి. దీంతో నారాయణపుర నుంచి ఏడు గేట్లద్వారా కృష్ణా జలాలు తెలుగు రాష్ర్టాలకు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం రాత్రి వరకు ఈ జలాలు జూరాలకు చేరుకునే అవకాశం ఉన్నద ని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. జలాలు జూరాలను తాకగానే మొదటగా విద్యుదుత్పత్తి ద్వారా, తర్వాత గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెపుతున్నారు. తుంగభద్రలో ఇన్‌ఫ్లో 18వేల క్యూసెక్కుల దాకా ఉండగా.. నీటి నిల్వ 17 టీఎంసీలకు చేరుకున్నది. మరోవైపు గోదావరిలోని శ్రీరాంసాగర్‌కు వరద తగ్గింది. పదకొండు వేల క్యూసెక్కుల నుంచి సోమవారం ఉదయానికి ఆరువేల క్యూసెక్కులకు పరిమితమైంది. కడెం, ఎల్లంపల్లికి స్వల్పంగానే వరద కొనసాగుతున్నది. ధవళేశ్వరం వద్ద కూడా లక్ష క్యూసెక్కుల పైచిలుకు నుంచి 93 వేల క్యూసెక్కులకు పరిమితమైంది.

ఎల్‌ఎండీకి 4వేల క్యూసెక్కులు విడుదల

రాజన్న సిరిసిల్ల జిల్లా శ్రీరాజరాజేశ్వర జలాశయం నుంచి సోమవారం అధికారులు ఎల్‌ఎండీకి నీటిని విడుదలచేశారు. మధ్యాహ్నం రివర్స్‌ స్లూయిస్‌ (తూములు) ద్వారా, సాయంత్రం గేట్ల ద్వారా నీటిని వదిలారు. మొదట 8 గేట్ల ద్వారా సుమారు 4 వేల క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం వరకు 10,321 క్యూసెక్కులకు పెంచారు. సోమవారం సాయంత్రానికి జలాలు ఎల్‌ఎండీకి చేరుకొన్నాయి. ఎస్సారార్‌ నుంచి 5 టీఎంసీల నీటిని ఎల్‌ఎండీకి తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈనెల 15 తర్వాత ఎల్‌ఎండీ దిగువ ఆయకట్టుకు వానకాలం సాగుకోసం నీటిని తరలించేందుకు చర్య లు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన మేరకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.


logo