గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 14, 2020 , 00:45:21

హమ్మయ్య..!

హమ్మయ్య..!

శుక్రవారం ఉదయం 9.15 గంటలు కావొస్తున్నది. అంతలోనే ముంబైలోని దలాల్‌స్ట్రీట్‌ భారీ ‘పిడుగుపాటు’కు గురైంది. దీంతో మదుపరుల హాహాకా రాలు మిన్నంటాయి. ఇప్పటికే కరోనా వైరస్‌ భయాలతో అతలాకుతలమవుతున్న దేశీయ మార్కెట్లను ఈ అలజడి మరింత కుంగదీసింది. వరుస పతనాలతో బెంబేలెత్తుతున్న మదుపరులు తమ షేర్ల అమ్మకాల కోసం పరుగులు తీశారు. ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లను కొద్దిసేపు నిలిపివేయాల్సివచ్చింది.

  • భీకర నష్టాల నుంచి కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు
  • అమ్మకాల ఒత్తిడితో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ బంద్‌
  • 12 ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి
  • -3,200 నుంచి +1,325 పాయింట్లకు

ముంబై, మార్చి 13: స్టాక్‌ మార్కెట్ల పతనం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారిపోయింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం బుసలు కొడుతుంటే మరోవైపు కరోనా వైరస్‌ దేశ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తున్నది. ఈ దెబ్బ కు స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సోమ, గురువారాల భారీ పతనాలను మర్చిపోకముందే శుక్రవారం మూడు వేల పాయింట్లకు పైగా పతనంతోనే ఆరంభమైంది. ప్రారంభించిన ఐదు నిమిషాల్లోనే దేశీయ స్టాక్‌ మార్కెట్లు పది శాతానికి పైగా కోల్పోవడంతో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ట్రేడింగ్‌లను నిలిపివేశారు. ఉదయం 9.20 నుంచి 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. మళ్లీ ఉదయం 10.30 గంటలకు తిరిగి ఆరంభమైంది. గత పన్నేండ్లలో ఇలా ట్రేడింగ్‌ను నిలిపివేయ డం ఇదే తొలిసారి. 


ప్రపంచ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు 2008లో ఇలా ట్రేడింగ్‌ను నిలిపివేశారు.  ఈ భారీ పతనాన్ని నిరోధించడానికి అటు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ మండ లి సెబీ, రిజర్వు బ్యాంక్‌లు రంగంలోకి దిగడంతో క్రమంగా కోలుకున్నాయి. కరోనా భయాలను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ ప్రకటన మార్కెట్లకు ఆక్సిజన్‌లా పనిచేసింది. ప్రారంభంలోనే 3,20 పాయింట్లకు పైగా పతనం చెందడంతో 29,388.97 పాయింట్ల కనిష్ఠ స్థాయికి జారుకున్న 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ సెన్సెక్స్‌ చివరకు 1,325.34 పాయిం ట్ల లేదా 4.04 శాతం లాభంతో 34,103. 48 వద్ద ముగిసింది. మొత్తంమీద సూచీ 5,380 పాయింట్లు తిరిగి కోలుకోగలిగింది. ఇంట్రాడేలో 8,555.15 పాయింట్ల కనిష్ఠా నికి పడిపోయిన నిఫ్టీ.. చివరకు 365.05 పాయింట్లు లేదా 3.81%  పుంజుకొని 9,955.20 వద్ద స్థిరపడింది. 


  • గత ఐదు సెషన్లలో దేశీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి 2.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఎఫ్‌పీఐలు ఉపసంహరించుకున్నారు. డీఐఐలు 1.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టడం విశేషం.  
  • టెలికం, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగ షేర్లు ఆరు శాతానికి పైగా లాభపడ్డాయి. 
  • మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. 
  • గత నాలుగు ట్రేడింగ్‌ రోజుల్లో సెన్సెక్స్‌ 3,473.14 పాయింట్లు(9.24%), నిఫ్టీ 1,034.25 పాయింట్లు(9.41%) నష్టపోయాయి. 
  • బీఎస్‌ఈలో 1,193 షేర్లు పతనమవగా, 1,191 షేర్లు లాభపడ్డాయి. 164 షేర్లు యథాతథంగా నిలిచాయి. 


15 శాతం వరకు పెరిగిన ఎస్బీఐ 

ఏడాది కనిష్ఠ స్థాయికి జారుకున్న ఎస్బీఐ షేరు భారీగా లాభపడి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇంట్రాడేలో 17 శాతానికి పైగా లాభపడిన బ్యాంక్‌ షేరు ధర చివరకు 13.87 శాతం లాభపడి రూ.242.25 వద్ద ముగిసింది. టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఓఎన్‌జీసీలు ఐదు శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, మారుతి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, పవర్‌గ్రిడ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, కొటక్‌ బ్యాంకులు లాభాల్లో ముగిశాయి.  


3.55 లక్షల కోట్లు పెరిగిన సంపద

భీకర నష్టాలతో మదుపరులకు ముచ్చెమటలు పట్టించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు చివరకు లాభాల్లోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రారంభంలోనే మూడు వేల పాయింట్లకు పైగా నష్టపోవడంతో రూ.12 లక్షల కోట్ల మదుపరుల సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. చివర్లో మార్కెట్లు భారీగా లాభపడంతో వీరి సంపద రూ.3.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3,55, 590.19 కోట్లు పెరిగి రూ.1,29,26, 242.82 కోట్లకు ఎగబాకింది. కాగా గత నాలుగు సెషన్లలో మదపరులు రూ.15 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. 


స్టాక్‌ మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ విమానయాన రంగ షేర్లు మాత్రం కుదేలయ్యాయి. కరోనా వైరస్‌తో ప్రయాణాలపై నియంత్రించడంతో ఈ రంగ షేర్లు 10 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఇండిగో, స్పైస్‌జెట్‌లు అత్యధికంగా నష్టపోయాయి. ఇండిగో పేరెంట్‌ కంపెనీ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ షేరు ఏకంగా 14.08 శాతం పతనమై 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.875ని తాకింది. స్పైస్‌జెట్‌ 9.99 శాతం తగ్గి లోహర్‌ సర్యూట్‌ రూ.43.70కి పడిపోయింది. 


logo