సోమవారం 25 మే 2020
Telangana - Apr 01, 2020 , 01:46:56

ఏకు మేకైతది జాగ్రత్త!

ఏకు మేకైతది జాగ్రత్త!

  • నిర్లక్ష్యంవహిస్తే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే
  • ఇంటికి పరిమితంకావడమే కరోనాకు మందు
  • ఎన్ని ఇబ్బందులున్నా లాక్‌డౌన్‌ను పాటించాల్సిందే
  • లేదంటే యావత్‌ దేశానికే ముప్పు
  • ‘యశోద’ సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు హెచ్చరిక

జనవరి 20న తొలి కరోనా కేసు నమోదైన అమెరికాలో ఆ సంఖ్య ఇప్పుడు 1,64,359 పెరిగింది. ఇటలీలో కూడా ఈ రెండునెలల్లో 1,01,739 మంది కరోనా బారినపడ్డారు. లాక్‌డౌన్‌ పాటించకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తున్నది. ఇలాంటి దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్‌ వ్యాప్తి చాలా నెమ్మదిగా జరుగుతున్నది. కానీ మొన్న జనం గుంపులుగా చేరడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఉన్నట్టుండి 1,251కి పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. చైనాలోని వుహాన్‌ నగరాన్ని చాలా కఠినంగా అష్టదిగ్బంధం చేయడంతో వైరస్‌ ఆ పక్కనే ఉన్న బీజింగ్‌కు కూడా వెళ్లలేకపోయింది. ఈ వాస్తవాన్ని గ్రహించి మనం ఇంటికే పరిమితం అవుదాం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: చైనాలో పుట్టిన కరోనా వైరస్‌.. ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని, దేశాలు, రాష్ర్టాలు, ప్రాంతాలు, జాతులు, మతాలు, కులాలు, వర్గాలతో నిమిత్తంలేకుండా మానవాళిని కబళిస్తున్న ఈ మహా మహమ్మారి మనకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నదని హైదరాబాద్‌ యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎంవీ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అదృశ్య శత్రువుతో పోరాడేందుకు మనచేతిలో అస్త్రశస్ర్తాలు లేవని, కరోనా వైరస్‌ నుంచి ప్రాణాలు దక్కించుకోవాలంటే లాక్‌డౌన్‌ను పాటించి ఇంటికి పరిమితం కావడమే సరైన మార్గమని, కీడెంచి మేలెంచాలన్న పెద్దల ఉవాచను పాటించడమే ఇప్పుడు మనం పాటించాల్సిన తారకమంత్రమని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ‘మన దేశం భిన్నమతాల సమాహారం. కానీ  ఇప్పుడు మనమంతా ఒకే మతంలా ముందుకుసాగాలి. కరోనాను తరిమికొట్టడమే మన ఏకైక అభిమతం కావాలి. 

ఈ పోరాటాన్ని ఒక్క నిమిషం ఆపినా మనం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు. కరోనా పాజిటివ్‌ కేసులు తక్కువే ఉన్నాయి కదా అని నిర్లక్ష్యంవహిస్తే మనపై ఈ మహమ్మారి మరింత విరుచుకుపడటం ఖాయమన్నారు. ఆర్థికంగానే కాకుండా శాస్త్ర, సాంకేతికరంగాల్లో ఎంతో అభివృద్ధి చెంది అగ్రరాజ్యంగా విలసిల్లుతున్న అమెరికాలోనే ఈ మహమ్మారిని అదుపుచేయలేకపోతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇంటికే పరిమితం కావాలన్న సూచనను జనం పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు ఇటలీ, స్పెయిన్‌ లాంటి దేశాల్లోనూ పరిస్థితి చేయిదాటిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి పలు దేశాల కంటే మన దేశంలో పరిస్థితి ఎన్నోరెట్లు మెరుగ్గా ఉన్నదని, అయినప్పటికీ మనం మున్ముందు రోజులను అత్యంత కీలక సమయంగా పరిగణించాలని స్పష్టంచేశారు. 

పారాహుషార్‌!

తెలంగాణలో తాజాగా ఆరుగురు కరోనా కోరలకు బలవడం మనకు గట్టి హెచ్చరికని, లాక్‌డౌన్‌ను విస్మరిస్తే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనడానికి ఇదే నిదర్శమని డాక్టర్‌ ఎంవీ రావు పేర్కొన్నారు. అమెరికా, ఇటలీలో కరోనా కేసులు భారీగా పెరుగడానికి లాక్‌డౌన్‌ పాటించకపోవడమే కారణంగా కనిపిస్తున్నదన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఇకనైనా ఇండ్లకే పరిమితం కావాలని సూచించారు.

అపోహలను నమ్మొద్దు..

కరోనా వైరస్‌ మన వాతావరణంలో బతకలేదని, మనలో రోగనిరోధకశక్తి చాలా ఎక్కువని, మన ఆచారాలు, అలవాట్లు గొప్పవి కాబట్టే ఈ వైరస్‌ మనవద్ద విస్తరించలేకపోతున్నదని సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న తప్పుడు వార్తలను, అపోహలను నమ్మవద్దని డాక్టర్‌ ఎంవీ రావు హెచ్చరించారు. ఇవన్నీ ఊహాజనితమైనవేనని స్పష్టం చేశారు. మహామహా శాస్త్రజ్ఞులే కరోనా వైరస్‌ను అర్థంచేసుకోలేక అయోమయంలో పడిపోతున్నారని, ఇలాంటి తరుణంలో మనం విశ్లేషణలు చేయడాన్ని మానుకొని కొవిడ్‌-19 నివారణ గురించి ఆలోచించాల్సిన అవసరమున్నదని ఉద్ఘాటించారు. ఆశీర్వాద్‌ గోధుమ పిండి కోసమని కొందరు, పిల్లాడికి పాలకూర తీసుకెళ్దామని మరికొందరు.. ఇలా అర్థంలేని కారణాలతో బయట తిరిగితే భారీమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇష్టమైన పదార్థాలను తర్వాతైనా తినొచ్చని, ప్రస్తుతానికి ఉన్న వాటితో రాజీపడాల్సిందేనని సూచించారు. నిత్యావసర వస్తువులకు ఎలాంటి కొరత ఉండదని తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇస్తున్నదని, అయినప్పటికీ సరుకులు దొరకవేమోనన్న భయంతో అందరూ ఒక్కసారిగా దుకాణాలకు ఎగబడితే పరిస్థితి చేయిదాటుతుందని హెచ్చరించారు. 

స్వేచ్ఛ కన్నా ప్రాణం మిన్న

లాక్‌డౌన్‌ వల్ల స్వేచ్ఛను కోల్పోతున్నామని, ఇంట్లో బందీలైపోతున్నామని బాధపడుతూ బయట తిరుగడం మూర్ఖత్వమని డాక్టర్‌ ఎవీ రావు పేర్కొన్నారు. అలా చేస్తే కరోనా వైరస్‌ మనతోపాటే ఇంటికొచ్చి కుటుంబసభ్యులందరికీ అంటుకొంటుందని హెచ్చరించారు. ఆవేశం ఎక్కువగా, అవగాహన తక్కువగా ఉండే యువత కరోనా వైరస్‌ను నిర్లక్ష్యం చేస్తున్నదని, రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉండే తమను కరోనా ఏమీచేయలేదన్న అపోహతో లాక్‌డౌన్‌ను తుంగలోతొక్కి బయట తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి యువతలో కొవిడ్‌-19 లక్షణాలు త్వరగా కనిపించకపోయినప్పటికీ వారి కుటుంబసభ్యులకు వైరస్‌ సోకి ప్రాణాలను హరించే ప్రమాదం ఉన్నదని తెలిపారు. కరోనా వైరస్‌లో వచ్చిన మార్పుల వల్ల పలు దేశాల్లో యువకులు కూడా చనిపోతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 

పిల్లలైనా జాగ్రత్త తప్పనిసరి

ప్రస్తుతం పిల్లల్లో కూడా కరోనా ఇన్ఫెక్షన్‌ కనిపిస్తున్నదని దీనికి అతీతులు కారని డాక్టర్‌ ఎంవీ రావు చెప్పారు. అయితే చిన్నారులు, యువకుల కన్నా ఈ వైరస్‌ పెద్దవాళ్లను ఎక్కువ ప్రమాదంలో పడేస్తున్నదని, పెద్దల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృత దశకు చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతతో నడుచుకోగలిగితే ఈ మహమ్మారి నుంచి మన కుటుంబాన్నే కాకుండా సమాజాన్ని, యావత్‌ దేశాన్ని రక్షించుకోగలుగుతామని డాక్టర్‌ ఎంవీ రావు హితవు పలికారు.


logo