శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 11, 2020 , 23:27:01

ఆలోచనల శతావధాని..

ఆలోచనల శతావధాని..

  • ‘లోపలి మనిషి’ రచయిత, సీనియర్‌ జర్నలిస్టు కల్లూరి భాస్కరంతో ప్రత్యేక ఇంటర్వ్యూ
  • పీవీ నరసింహారావు ఇంగ్లిష్‌లో రాసిన అపూర్వ బృహన్నవల ‘ఇన్‌సైడర్‌' వివిధ భాషల్లోకి అనువాదమై ప్రశంసలను పొందింది. ‘లోపలి మనిషి’ పేరుతో దానిని రచయిత, సీనియర్‌ జర్నలిస్టు కల్లూరి భాస్కరం తెలుగులోకి అనువదించారు. పీవీ శతజయంతిని పురస్కరించుకుని ఆయనతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
  • నేను ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి టెలిగ్రాఫ్‌ పత్రికలో ‘ఇన్‌సైడర్‌'కు సంబంధించిన వ్యాసం ఒకటి ప్రచురితమైంది. దానిని చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం.. ఉత్సాహం కలిగింది. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని అనుకున్నాను.
  • పుస్తక అనువాదంలో పీవీ గారి సలహాలు, సూచనలు అనేకం. పీవీ అనువాదానికి సమ్మతించినా అందుకు సంబంధించిన ప్రూఫులన్నీ తాను చూడాల్సిందేనని షరతుపెట్టారు.పీవీది భూతద్దం లాంటి చూపు. 
  • ఆయన దృష్టి నుంచి తప్పులు తప్పించుకోలేకపోయేవి. ఆయన అంత నిష్టగా ప్రూఫులు చూసేవారు.
  • పీవీ దూరదృష్టి ఎంతటి గొప్పది అంటే పాఠ్యపుస్తకాల్లో వాడుక భాషనే ఉండాలని, అందులో మూడుప్రాంతాలైన నైజాం, రాయలసీమ, ఆంధ్ర మాండలికాలను కూడా ఉపయోగించాలని సూచించారు.

పీవీతో ఎలా పరిచయం ఏర్పడింది? మీ సాన్నిహిత్యం ఎలా ఉండేది? 

పీవీతో అంతకు ముందెప్పుడూ నాకు ఎలాంటి పరిచయం లేదు. ‘ఇన్‌సైడర్‌'ను అనువాదం చేసే సమయంలోనే 1998లో ఆయనతో పరిచయం ఏర్పడి, సాన్నిహిత్యం ఏర్పడింది. ఆయన వద్దకు వెళ్లిన ప్రతిసారి ఆప్యాయంగా పలుకరించేవారు. రాజకీయాలు, సాహిత్యం, తెలుగు భాష ఇలా అనేకానేక విషయాలు చర్చించేవారు.  

‘ఇన్‌సైడర్‌'ను తెలుగులోకి అనువదించాలని ఎందుకు అనుకున్నారు? ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?

నేను ఆంధ్రప్రభ పత్రికలో పనిచేస్తున్నప్పుడు ఒకసారి టెలిగ్రాఫ్‌ పత్రికలో ‘ఇన్‌సైడర్‌'కు సంబంధించిన వ్యాసం ఒకటి ప్రచురితమైంది. దానిని చదివినప్పుడు ఎంతో ఆశ్చర్యం.. ఉత్సాహం కలిగింది. ఆ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని అనుకున్నాను.దాన్ని సీరియల్‌గా వేద్దామని ఆంధ్రప్రభ -ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ యజమాని మనోజ్‌ సొంతాలియ చెప్పారని, దానిని మీరే అనువదించాలని సంపాదకులు వాసుదేవదీక్షితులు నాతో అన్నారు. అందువల్లే అనువాదానికి పూనుకున్నాను.


పుస్తక అనువాదం విషయాన్ని పీవీకి చెబితే ఆయన ఎలా స్పందించారు?

నేను పుస్తకాన్ని అనువాదం చేద్దామని నిర్ణయించుకున్న సమయానికి పీవీ గారు ప్రధానమంత్రిత్వం నుంచి దిగిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పటికీ నేను ఎవరో ఆయనకు తెలిసే అవకాశం లేదు. మేమే ‘ఇన్‌సైడర్‌' అనువాదం గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఆయన చాలా సంతోషించారు. కానీ ‘ముందు ఒకటి రెండు అధ్యాయాలు రాసి పంపండి. చూసి చెబుతాను’ అన్నారు. నేను అనువదించి పంపాక చూసి బాగుంది, కొనసాగించండి అంటూ ఉత్తరం రాశారు.  

అనువాద ప్రక్రియలో పీవీ ఏమైనా సలహాలు సూచనలు ఇచ్చారా?

పుస్తక అనువాదంలో పీవీ గారి సలహాలు, సూచనలు అనేకం. పీవీ అనువాదానికి సమ్మతించినా అందుకు సంబంధించిన ప్రూఫులన్నీ తాను చూడాల్సిందేనని షరతుపెట్టారు. ఆ సమయంలో కంప్యూటర్‌ ద్వారా తెలుగు టెకట్స్‌ పంపే అవకాశం లేదు. దీంతో రాసింది కంపోజ్‌ చేయించి ఢిల్లీకి కంటైనర్‌లో పంపేవాళ్లం. అక్కడ మా పత్రిక ప్రతినిధి వాటిని తీసుకుని పీవీకి అందజేయడం.. ఆయన ప్రూఫ్‌ రీడింగ్‌ చేసిన తరువాత తిరిగి వాటిని ఇక్కడికి పంపడం చేసేవారు. 

సీరియల్‌ వేసిన అనువాదాన్ని పుస్తకంగా తీసుకువచ్చాక పీవీ ఏమన్నారు?

సీరియల్‌ ప్రచురితమైనన్ని రోజులూ పీవీ ఎప్పటికప్పుడు దానిపై ఆరా తీసేవారు. పాఠకులు ఎలా స్వీకరిస్తున్నారు? అని అడిగేవారు. సీరియల్‌ పూర్తయ్యాక దానిని ఎమ్మెస్కో వారు ‘లోపలి మనిషి’ పేరుతో  పబ్లిష్‌ చేశారు. ఆ పుస్తకావిష్కరణ సభలను విశాఖపట్నం, విజయవాడలో నిర్వహించారు. ఆ సందర్భంగా పీవీ నా అనువాదంపై మాట్లాడారు. మీరు మాములు ట్రాన్స్‌లేటర్‌ కాదు. నా ఇంటర్‌ప్రిటర్‌ అని అభినందించడం నేనెప్పటికీ మరిచిపోలేను. ‘ఇన్‌సైడర్‌' రెండవ భాగాన్ని కూడా నేను(భాస్కరం) అనువదిస్తానని విజయవాడ ఆవిష్కరణ సభలో పీవీ ప్రకటించారు. 

వాస్తవానికి పీవీ గారే అనువాదంలో ఘనులు. మీరు ఆయన పుస్తకాన్ని అనువదించారు. అసలు అనువాద సాహిత్యంపై పీవీ అభిప్రాయం ఎలా ఉండేది?

అనువాద ప్రక్రియపై పీవీది ప్రత్యేక కోణం. చాలా మంది రచయితలు ఇతర భాషల సాహిత్యాన్ని, పుస్తకాలను అనువాదం చేసేప్పుడు దానికి తెలుగు నుడికారాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. పీవీ అది తప్పనేవారు. వేరే భాషకు చెందిన  నుడికారాన్ని యథాతథంగా తెలుగు అభివ్యక్తీకరణకు తీసుకురావాలని అనేవారు. అప్పుడే తెలుగుభాష పదసంపద పెరుగుతుందనేవారు. ఏలూరుకు చెందిన రచయిత పటారు శివరామయ్యశాస్త్రి బెంగాలీ నుంచి ఒక కథను అనువదించారు. సాధారణంగా బెంగాలీలు తద్దినాల తంతులో చేప అనేది కచ్చితమైన వంటకం. కానీ ఆ రచయిత తెలుగులో దానిని అనువదించేప్పుడు చేపకు బదులు పనసను చేర్చారని పీవీ ఉదహరించారు. అనువాదంపై అంతటి లోతయిన ఆలోచనలున్నవారు పీవీ.

చాలామంది ‘లోపలి మనిషి’ నవలను పీవీ గారి ఆత్మకథనే అభివర్ణిస్తారు? దానిపై మీ అభిప్రాయం? పీవీ ఏమనేవారు? 

ఒక్కముక్కలో చెప్పాలంటే అది పాక్షికంగా పీవీ ఆత్మకథ. సమకాలీన రాజకీయ దుర్లక్షణాలను లోపలిమనిషి పుస్తకంలో పీవీ చిత్రీకరించారు. ఆయన ఒక ప్రేక్షకుడిగా మారి రాజకీయవ్యవస్థలోని లోపాలను నిర్దిష్టంగా ఎత్తిచూపారు. దానిని నవల అని పిలవాలా? ఆత్మకథని అనాలా? అని ఒక సందర్భంలో పీవీని అడిగితే ‘ఇప్పటికైతే దీనిని ఒక రచన అందాం’ అని సమాధానమిచ్చారు. 

ఆ పుస్తకంలో మీకు నచ్చిన అంశాలేమిటీ?

‘లోపలి మనిషి’ పుస్తకంలో ఆకర్షించే ఘట్టాలు అనేకమున్నాయి. అయినా ఒకటి అన్నిటికంటే ఎక్కువగా నన్ను ఆకట్టుకుంది. పుస్తకంలోని కథానాయకుడైన ఆనంద్‌ తొలిసారిగా మంత్రిగా ప్రమాణం చేస్తాడు. ఆ తరువాత అధికారం దేనికీ? అని ప్రశ్నించుకుంటాడు. జల్సాగా అనుభవించడానికి, ఎర్రలైటు కోసం కాదు అని నిర్ణయించుకుంటాడు. అధికారం అనేది ఏదయినా చేయాలి. ఈ ఆత్మవిమర్శ క్రమం పుస్తకంలో మూడు, నాలుగు పేజీలు ఉంటుంది. అది ఎంతో హృద్యంగా వివరించారు పీవీ. 

పీవీతో మరచిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా?

పీవీతో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయి. అయినా నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన ఒకటి ఉంది. ఒకసారి ‘ఇన్‌సైడర్‌' పుస్తకానికి సంబంధించి కొన్ని అధ్యయనాలను పూర్తిచేసి ఆయన పరిశీలనకు ఢిల్లీకి పంపాను. వాటి ప్రూఫ్‌ చూసి తిరిగి నాకు పంపి ఆయన అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లాక మళ్లీ ఫోన్‌ చేసి ‘భాస్కరం గారు మీరు ఒక పదాన్ని ఇలా రాశారు. దానిని వేరేలా సవరిస్తే బాగుటుంది’ అని ఆ పదమున్న పేజీతో పాటు పేరా సంఖ్యను కూడా తెలిపారు. అది విని, అటు తరువాత ఆ పదాన్ని చూసి ఆ వయసులోనూ పీవీ జ్ఞాపకశక్తికి నేను ఆశ్చర్యపోయాను. 

పీవీ వ్యక్తిత్వాన్ని ఎలా అభివర్ణిస్తారు?

ప్రధానమంత్రిగా చేశారు. ఎలా ఉంటారో? ఏమోనని మొదట నేను చాలా భయపడ్డాను. కానీ పీవీ చాలా సాదాసీదా మనిషి. అచ్చమైన తెలంగాణ యాసలో మాట్లాడేవారు. సున్నితహాస్య చతురులు. ఆయన మాట్లాడడానికి ఇష్టపడరు అంటారు అందరూ. కానీ నిజానికి మాట్లాడటాన్ని ఆయన ఎంతో ఇష్టపడేవారు. ఆయన నిత్య సంస్కరణశీలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆలోచనల శతావధాని. 100 మంది పృచ్ఛకులకు అవధాని ఏవిధంగానైతే సమాధానం చెపుతాడో పీవీ గారూ అంతే.

పీవీతో సన్నిహితంగా మెదిలిన ఓ రచయితగా ఆయన సాహిత్యాభిలాష, భాషాసేవను ఎలా వివరిస్తారు?

సృజనాత్మక సాహిత్యాన్ని సృష్టించడమే భాషాసేవ అనడం సబబు కాదు. బూదరాజు రాధాకృష్ణ అన్నట్లు వ్యక్తిగతంగా భాషా సేవ చేయడం వేరు. ఒక బృందంలో భాగంగా చేయడం వేరు. భాషకు అనేక పార్శ్వాలు, అనేక కోణాలు ఉంటాయి. సైన్స్‌, న్యాయశాస్ర్తాలను తమ మాతృభాషలో వ్యక్తికరించే శక్తిని పెంపొందించాలి. సంకుచిత కోణం నుంచి చూడవద్దు. ఆయా అంశాల పరంగా చూస్తే పీవీ తెలుగుభాష వ్యాప్తికి విశేష కృషి చేశారు. ప్రభుత్వ రాతప్రతులు తెలుగులోనే సాగేలా చూశారు. ఆయన దూరదృష్టి ఎంతటి గొప్పది అంటే పాఠ్యపుస్తకాల్లో వాడుక భాషనే ఉండాలని, అందులో మూడుప్రాంతాలైన నైజాం, రాయలసీమ, ఆంధ్ర మాండలికాలను కూడా ఉపయోగించాలని సూచించారు.

ఇంటర్వ్యూ: మ్యాకం రవికుమార్‌


logo