శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 01:00:42

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ కన్నుమూత

  • సీఎం కేసీఆర్‌, మంత్రుల సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/ బెల్లంపల్లి టౌన్‌: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్‌ నేత గుండా మల్లేశ్‌ (75) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన నిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. బుధవారం బెల్లంపల్లిలో అంత్యక్రియలు జరుగనున్నాయి. మల్లేశ్‌ భౌతిక కాయాన్ని తొలుత నారాయణగూడలోని మఖ్దుంభవన్‌కు, అనంతరం స్వగ్రామం బెల్లంపల్లికి తరలించారు. మల్లేశ్‌ తొలిసారిగా 1983లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985-89, 1994-99 లోనూ ప్రాతినిధ్యం వహించారు. 2009లో బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందడమేగాక, సీపీఐ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు.

గుండా మల్లేశ్‌ మృతి పట్ల సీఎం కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లేశ్‌తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. మల్లేశ్‌ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మల్లేశ్‌ మృతిపై పలువురు మంత్రులు, సీనియర్‌ నాయకులు సం తాపం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సంతా పం తెలిపినవారిలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు, రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతోపాటు పలువురు సీనియర్‌ నేతలున్నారు.logo