గురువారం 02 జూలై 2020
Telangana - Jun 14, 2020 , 02:51:43

భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్‌

భారీగా కల్తీ పత్తి విత్తనాలు సీజ్‌

  • రూ. కోటి విలువైన 13 టన్నులు స్వాధీనం 
  • నలుగురి అరెస్టు.. పరారీలో ముగ్గురు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పెద్దఎత్తున కల్తీ విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ బృందం పట్టుకున్నది. రూ. 1.04 కోట్ల విలువైన 13 టన్నుల పత్తి విత్తనాలను శనివారం స్వాధీనం చేసుకున్నది. మేడ్చల్‌ జిల్లా దేవరయాంజాల్‌లో సన్‌రైజ్‌ అగ్రో సీడ్స్‌ పేరుతో శ్రీరామ్‌ అనే వ్యక్తి విత్తనాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతంలో తమిళనాడులోని సెం థిల్‌ సీడ్స్‌ కంపెనీ నుంచి ధృవ్‌గోల్డ్‌, లోధా బీజీ-2 పత్తి విత్తనాలు తీసుకొచ్చాడు. వాటి గడువు ఫిబ్రవరిలో తీరింది. వాటిని ఇతర బ్యాగుల్లో నింపి కర్నూలు సీడ్స్‌ కంపెనీకి రూ.300 చొప్పున అమ్మేశాడు. కర్నూలు సీడ్స్‌ ఎండీ శ్రీనివాస్‌ గడువు తీరిన విత్తనాలను శుద్ధిచేసి వాటిని గుర్తించకుండా ఆ కంపెనీ ప్యాకింగ్‌లోకి మా ర్చి అమ్మేందుకు కుట్రపన్నాడు. బాలానగర్‌ ఎస్వోటి ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ బృందం  దేవరయంజాల్‌ సన్‌రైజ్‌ గోదాంపై దాడిచేసింది. 13 టన్నుల గడువు తీరిన విత్తనాలను స్వాధీనం చేసుకున్నది. నిందితులు ముప్పనేని శివనాగేశ్వరరావు, షాకమూరి వెంకటేశ్వరరావు, మధుగుండు అశ్విన్‌కుమార్‌, కే అంజిరెడ్డిని అరెస్టు చేసింది. సన్‌రైజ్‌ కంపెనీ ఎండీ శ్రీరామ్‌, కర్నూలు సీడ్స్‌ కంపెనీ ఎండీ శ్రీనివాస్‌, సన్‌రైజ్‌ సీడ్స్‌ కంపెనీ సూపర్‌వైజర్‌ నాయుడు పరారీలో ఉన్నారు.  


logo