సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 14, 2020 , 01:21:31

మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు

  • ఉదాసీనంగా వ్యవహరిస్తే అధికారులనూ వదలం
  • ఎక్సైజ్‌శాఖ సమీక్షలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ పీరియడ్‌లో మద్యం విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే దుకాణదారుల లైసెన్స్‌లు రద్దుచేస్తామన్నారు. సోమవారం ఆయన రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆబ్కారీశాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

లాక్‌డౌన్‌ను పక్కాగా అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తప్పవన్నారు. వైన్స్‌లపై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని, ఎక్సైజ్‌శాఖ టాస్క్‌ఫోర్స్‌ ద్వారా అన్నింటినీ పరిశీలించి కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు అక్రమ మద్యం విక్రయాలపై 675 కేసులు పెట్టామని చెప్పారు. శాఖ తీసుకొన్న చర్యల వల్ల మద్యానికి బానిసలైనవారి సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. మొదట్లో ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయానికి రోజుకు 140 నుంచి 150 కేసులు వచ్చాయని, ప్రస్తుతం రోజుకు రెండు లేదా మూడు కేసులే వస్తున్నాయని తెలిపారు.


logo