శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:39:31

రాష్ట్రమంతటా స్వీయ నియంత్రణ

రాష్ట్రమంతటా స్వీయ నియంత్రణ

  • పట్టణాలు, పల్లెల్లోనూ కరోనా భయం
  • వైరస్‌ కట్టడికి సర్కార్‌కు అండగా వ్యాపారులు
  • అంతటా స్వచ్ఛంద లాక్‌డౌన్‌ అమలు

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాపారులు అప్రమత్తమయ్యారు. అక్కడక్కడా కాలనీల వారు సైతం తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు తరువాత ప్రజలు ఎవరి పనుల్లో వారు బిజీ కావడం.. చాలామంది రోడ్లపైకి వస్తుండటం, మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో కరోనా వ్యాప్తి చెందుతున్నది. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన కరోనా వైరస్‌ ప్రస్తుతం పట్టణాలు, పల్లెలను సైతం తాకింది. కరోనా కట్టడికి తమవంతు బాధ్యతగా వ్యాపారులు స్పందించి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాం తాల్లో వ్యాపారులు వారం రోజులుగా తమ దుకాణాలు మూసి ఉంచుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సోమవారం నుంచి బంగారం దుకాణా లు కూడా మూతపడ్డాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం నుంచి వ్యాపారులు బంద్‌ పాటిస్తున్నారు. మంగళవారం నుంచి రైస్‌మిల్లులు సైతం బంద్‌ చేయాలని నిర్ణయించారు. దేవరకొండలో వారం రోజులపాటు పూర్తిగా లాక్‌డౌన్‌కు వ్యాపారులు నిర్ణయించారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి, మేళ్లచెర్వు, నడిగూడెం, గరిడేపల్లి, చిలుకూరు మండలాల్లో మధ్యాహ్నం వరకే తెరుస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరితోపాటు చౌటుప్పల్‌, వలిగొండలో సాయంత్రం 4 వరకే దుకాణాలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌, అందో లు, సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణాల్లో పూర్తి స్థాయిలో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. సంగారెడ్డి పట్టణంలో వర్తక, వస్త్ర వ్యాపారు లు పూర్తిస్థాయి బంద్‌ పాటిస్తున్నారు. పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం లో కాలనీల వారీగా ఎవరికి వారు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా పదరలో ఈనెల 22 నుంచి 31వరకు మెడికల్‌ షాపులు, ఎరువులు దుకాణాలు మినహాయించి వ్యాపార సంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌ పాటించనున్నాయి. కరీంనగర్‌లోని ఆదర్శ్‌నగర్‌కు చెందిన శివాలయ కమ్యూనిటీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు వీధుల వారు ఈనెల 15 నుంచి నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ విధించుకున్నారు. పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ పట్టణాలు, గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వ్యాపారులు దుకాణాలను తెరిచే సమయాన్ని కుదించుకున్నారు. జగిత్యాలలో ఇప్పటికే వ్యాపారులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. కొడిమ్యాల మండలంలో మంగళ, బుధవారాలు సంపూర్ణంగా బంద్‌ పాటించాలని నిర్ణయించారు. ఖమ్మంలోని గాంధీచౌక్‌ ప్రాంతంలో వ్యాపారులు ఈనెల 21 నుంచి 28వరకు  లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వ్యాపారులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు.

మా ఊరికి రావొద్దు..

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌, పొత్కపల్లి, ఓదెల, జీలకుంట, ఎలిగేడు మండల కేంద్రం, కాల్వశ్రీరాంపూర్‌ మండలం, జూలపల్లి మండలం అబ్బాపూర్‌లో స్థానికులు ఆంక్షలు విధించుకున్నారు. ‘నాలుగు నెలలపాటు ఎక్కడికి వెళ్లొద్దు.. గ్రామంలోకి ఎవరూ రావొద్దు’ అని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 9వరకు లాక్‌డౌన్‌గా నిర్ణయించి.. గ్రామంలో ఎవరైనా ఆటోలను నడిపితే రూ.20వేల జరిమానా విధించాలని తీర్మానించారు. logo