కరీంనగర్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): నాణ్యమైన సరుకులు చవక ధరలకే అందిస్తున్న స్వయంసహాయక బృందాల దుకాణాలు ప్రజాదరణ పొందుతున్నాయి. మన దుకాణం-మన వస్తువులు అనే నినాదంతో విస్తరిస్తున్న తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ నిరుపేద మహిళల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. స్త్రీనిధి ద్వారా రుణాలు ఇచ్చి వ్యాపారం చేసుకొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన 58 నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు చవకగా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. బైరిసన్స్ ఆగ్రో ఇండియా సంస్థ పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ దుకాణాలు కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే అనేకం వచ్చాయి.
ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ పేరుతో ప్రత్యేక దుకాణాలు
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ పేరుతో గ్రామాల్లో ఈ ప్రత్యేక దుకాణాలు ప్రారంభిస్తున్నది. నాణ్యమైన నిత్యావసర వస్తువులను బైరిసన్స్ సంస్థ సేకరించి వాటిని ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి ఈ దుకాణాలకు సరఫరా చేస్తున్నది. తయారీదారులు, అమ్మకందారులకు సంధానకర్తలుగా ప్రతి దుకాణానికి ఒక ఎస్‌హెచ్‌జీ మిత్రను నియమిస్తున్నారు. హైపర్ మార్కెట్లకు ఏమాత్రం తగ్గకుండా కస్టమర్ల వివరాలను బీమార్ట్ అనే యాప్‌లో అనుసంధానిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ ఇప్పటికే 20కి పైగా ఏర్పాటు చేశారు. చిగురుమామిడి, రామడుగు, గంగాధర, కరీంనగర్ రూరల్, మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ తదితర మండలాల్లోనూ నెలకొల్పారు.
మా సంస్థ తరఫున సహకారం..
ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ ఏర్పాటుకు మా సంస్థ తరఫున పూర్తి సహకారం అందిస్తున్నాం. వారి గ్రామాల్లో స్టోర్స్ ప్రారంభించాలనుకునే మహిళలు సంఘం నుంచి కనీసం రూ.లక్ష పెట్టుబడి పెట్టాలి. ఇందుకు సెర్ప్ ద్వారా రుణం అందిస్తారు. మా సంస్థ తరఫున రూ.50వేల సరుకులు అందిస్తాం. మరో రూ.50 వేలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. మహిళలపై భారం పడకుండా టర్నోవర్‌ను బట్టి సరుకులు సప్లయ్ చేస్తాం. ఎస్‌హెచ్‌జీలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ బాధ్యత మేమే తీసుకుంటున్నాం.
-డాక్టర్ ప్రసాద్ పాశం, చైర్మన్ బైరిసన్స్ ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
ఆర్థిక స్వావలంబనకు దోహదం
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వీటిని ఏర్పాటు చేశాం. మరిన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులు విక్రయించడం ద్వారా వారికి నేరుగా ఆదాయం వస్తుంది. బైరిసన్స్ సంస్థ వారు మార్కెటింగ్‌లో మహిళలకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. -ఎల్ శ్రీలతారెడ్డి, డీఆర్డీవో, కరీంనగర్ జిల్లా