గురువారం 09 జూలై 2020
Telangana - Jun 11, 2020 , 19:19:07

అందుబాటులో ఎన్నెస్సీఎల్‌ విత్తనాలు

అందుబాటులో ఎన్నెస్సీఎల్‌ విత్తనాలు

హైదరాబాద్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా జాతీయ విత్తన సంస్థ పనిచేస్తున్నది. అన్నిరకాల ఆహార, కూరగాయలు, పశుగ్రాస విత్తనాలను ఈ సంస్థ విక్రయిస్తున్నది. ఈ వానకాలం సీజన్‌లో కొత్తగా బీటీ పత్తి, ఆలుగడ్డ, పశుగ్రాసం విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి జాతీయ విత్తన సంస్థ హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలతో కలిసి పనిచేస్తున్నది. 

వరి, మక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర 18 రకాల ఆహారపంటలకు సంబంధించిన విత్తనాలు ఎన్నెస్సీఎల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది నుంచి యువరాజ్‌ బీటీ-2, బీపీటీ పత్తి రకాలతోపాటు, జ్యోతి, హిమాలీనియా బంగాళాదుంప రకాలు, పశుగ్రాసం విత్తనాలను కూడా విక్రయించనున్నారు. పెరటి తోటల పెంపకానికి వీలుగా ఆసక్తి చూపే కుటుంబాలకు 16 రకాల కూరగాయల విత్తనాలతో ప్రత్యేక కిట్లను అందిస్తున్నది. స్థానిక రైతులతో విత్తనోత్పత్తి చేయించి, వాటిని ప్రాసెసింగ్‌, ప్యాకింగ్‌ చేయించి సీజన్ల వారీగా ఆయారాష్ర్టాలకు పంపుతూ వ్యాపారాభివృద్ధి దిశగా జాతీయ విత్తన సంస్థ ముందుకెళ్తున్నది. రానున్న ఐదేండ్లలో విత్తన వ్యాపారాన్ని రెట్టింపుచేసి.. బహుళజాతి, ప్రైవేట్‌ కంపెనీలకు దీటుగా అభివృద్ది చెందేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు జాతీయ విత్తన సంస్థ ప్రాంతీయ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ బ్రిట్టో పేర్కొన్నారు.


logo