శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 01:50:31

సచివాలయ పాత భవనాలను కూల్చవచ్చు

సచివాలయ పాత భవనాలను కూల్చవచ్చు

  • హైకోర్టు అనుమతి.. కొత్త భవనాలకు లైన్‌ క్లియర్‌
  • 10 పిటిషన్లను కొట్టేసిన ధర్మాసనం 
  • మంత్రివర్గ నిర్ణయంలో చట్టపర లోపాల్లేవు
  • అందులో జోక్యం చేసుకోలేం: ధర్మాసనం

‘భవనాల నిర్మాణం లేదా కూల్చివేత అనేది ప్రభుత్వాలు తీసుకునే విధాన నిర్ణయం. ఇందులో జోక్యం చేసుకోవడానికి తక్కువ అవకాశం ఉంటుంది. సచివాలయ భవనాల కూల్చివేత, కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన నిర్ణయంలో చట్టపరమైన లోపాలేవీ మాకు కనిపించలేదు. క్యాబినెట్‌ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం’

- హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ సచివాలయం కొత్త భవన నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోయాయి. పాత సచివాలయ భవనం కూల్చివేతకు మార్గం సుగమమైంది. రాష్ట్ర వైభవాన్ని ప్రపంచానికి చాటేలా కళాత్మక సమీకృత బ్రాండ్‌ తెలంగాణ సచివాలయం రూపుదిద్దుకొనేందుకు సర్వంసిద్ధమైంది. పాత సచివాలయ భవనం కూల్చివేత, కొత్త నిర్మాణాన్ని అడ్డుకోవాలని పలువురు కాంగ్రెస్‌ నాయకులు, ఇతరులు దాఖలుచేసిన దాదాపు 10 పిటిషన్లను హైకోర్టు సోమవారం కొట్టేసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం.. చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం సచివాలయ నిర్మాణానికి సంబంధించిన అత్యంత కీలక తీర్పును వెలువరించింది. 

భవనాల నిర్మాణం లేదా కూల్చివేత అనేది ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయమని స్పష్టంచేసింది. విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని తెలిపింది. రాజ్యాంగం లేదా చట్టాలు లేదా ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురైనప్పుడు మాత్రమే రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నది. సచివాలయ భవనాల కూల్చివేత, నూతన భవన నిర్మాణానికి సంబంధించిన నిర్ణయంలో చట్టపరమైన లోపాలేవీ తమకు కనిపించలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని పేర్కొన్నది. 

విస్తృత ప్రజాప్రయోజనం కోసం నిధులు ఖర్చుపెట్టడం అనేది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. ఆ ఖర్చు అవసరమైనదా? కాదా? ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలు ఆధునిక పాలనా విధానానికి అనుకూలంగా లేవు. దీంతో పాత భవనాలను కూల్చి,  ఆ స్థానంలో అత్యాధునిక వసతులతో కొత్తది నిర్మించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. దీనికి వ్యతిరేకంగా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, వాదనల అనంతరం ఈ మేరకు తీర్పునిచ్చింది.

సెక్షన్‌ 8 అనేది పసలేని వాదన

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చాలంటే గవర్నర్‌ అనుమతి కావాలని పిటిషనర్ల చేసిన వాదన పసలేనిదని ధర్మాసనం అభిప్రాయపడింది. గరిష్ఠంగా పదేండ్ల వరకు హైదరాబాద్‌ కామన్‌ క్యాపిటల్‌ అని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్‌ 8 చెప్తున్నదని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వేరే రాజధాని ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌ కామన్‌ క్యాపిటల్‌గా ఉండబోదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తంచేసింది. ఏపీకి ప్రత్యేక రాజధాని ఏర్పడ్డాక పునర్విభజన చట్టంలోని కొ న్ని సెక్షన్లు కాలగర్భంలో కలిసిపోతాయని పేర్కొన్నది. పదేండ్లు అనేది కామన్‌ క్యాపిటల్‌గా ఉపయోగించుకునేందుకు ఇచ్చిన గరిష్ఠ సమయ మేనని, ఆలోపు ఎప్పుడైనా కొత్త రాజధానికి తరలిపోవచ్చనేది దాని అర్థమని తెలిపింది. ఏపీ ప్రభుత్వమే హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను ఖాళీచేసి తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించిందని ధర్మాసనం గుర్తుచేసింది. 

అప్పుంటే.. మౌలిక సదుపాయాలు వద్దా?

అప్పు ఉన్నదని మౌలిక సదుపాయాలు, నిర్మాణాలు చేపట్టకుండా ఉండాలని ఎక్కడా లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అప్పులు, నిధుల కేటాయింపు, ఖర్చు అనే అంశాలు ఎగ్జిక్యూటివ్‌ నిర్ణయాలని, రాజ్యాంగం ఆ అంశాన్ని ప్రభుత్వాల (ఎగ్జిక్యూటివ్‌)కు వదిలేసిందని పేర్కొన్నది. నిధులకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటాయని తెలిపింది. ఈ విషయాల్లో జోక్యానికి న్యాయవ్యవస్థకు అవకాశంలేదని స్పష్టంచేసింది.

తీర్పు సస్పెన్షన్‌కు నిరాకరణ

సచివాలయ నిర్మాణంపై హైకోర్టు వెలువరించిన తీర్పును నాలుగు నెలలపాటు సస్పెండ్‌చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తిచేశారు. తాము సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసుకుంటామని అభ్యర్థించారు.  తీర్పు నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో అత్యవసర కేసులపై వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరుగుతున్నదని తెలిపింది.

రాజకీయ ప్రేరేపిత పిటిషన్లు

  • సుదీర్ఘ వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌

సచివాలయ పాత భవనాల కూల్చివేత, నూతన భవన నిర్మాణం అంశంపై హైకోర్టులో గంటల తరబడి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయాన్ని సమర్థిస్తూ అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ సమగ్ర వాదనలు వినిపించారు. క్యాబినెట్‌ నిర్ణయానికి మద్దతుగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఆయన ఊటంకించారు. మంత్రిమండలి నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి అవకాశాలు చాలా చాలా పరిమితమని గుర్తుచేశారు. విధానపరమైన అంశాల్లో ప్రజా ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయమని పేర్కొన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఏజీ.. ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పిటిషనర్లలో ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎంపీ, శాసనసభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తప్పు చేసిందని ప్రజాప్రతినిధులు భావిస్తే చట్టసభల్లో పోరాడాలని, అలా ప్రస్తావించకుండా న్యాయస్థానాలను వేదికగా చేసుకోవడం ఎంతవరకు సబబని నివేదించారన్నారు.

పాత భవనాలు కూల్చాలా? అలాగే ఉంచి మార్పులు చేయాలా? అనే అంశాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం క్యాబినెట్‌ సబ్‌కమిటీని వేసిందని తెలిపారు. ఆ కమిటీ నిర్ణయం తీసుకునేందుకు టెక్నికల్‌ కమిటీని కూడా వేసినట్టు చెప్పారు.  ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చాలని నివేదిక ఇచ్చిందని తెలిపారు. టెక్నికల్‌ కమిటీ రిపోర్ట్‌ ఆధారంగా పాత భవనాలు పనికిరావని నిర్ధారించుకున్న తర్వాతే ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ సహాయ బృందంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్‌ పర్‌షద్‌, ప్రభుత్వ న్యాయవాదులు సంతోష్‌కుమార్‌, పీ రాధీవ్‌, శ్రీపతి సంతోష్‌కుమార్‌, ఏజీపీ సాయికృష్ణ తదితరులు ఉన్నారు.

‘అభివృద్ధిని అడ్డుకోవాలని కేసులు’

అభివృద్ధిని అడ్డుకోవాలనే రాజకీయ దురుద్దేశంతో కొంతమంది నూతన సచివాలయ నిర్మాణంపై కేసుల వేశారని అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ కొంతం గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకులకు ఈ తీర్పు చెంపపెట్టులాంటిదని చెప్పారు. హైకోర్టు తీర్పుపై గోవర్ధన్‌రెడ్డితోపాటు జేఏసీ నాయకులు సీహెచ్‌ ఉపేందర్‌, టీ శ్రీధర్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.


logo