బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 13, 2020 , 02:51:13

సచివాలయ డిజైన్లు ఖరారు కాలేదు

సచివాలయ డిజైన్లు ఖరారు కాలేదు
  • నిర్మాణ నమూనాలపై క్యాబినెట్‌ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు
  • సచివాలయ నిర్మాణంపై వివరాలు వెల్లడించిన ప్రభుత్వం
  • తుది నిర్ణయం వరకు ప్రస్తుత భవనాలను కూల్చొదన్న హైకోర్టు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుత సచివాలయ భవనాల స్థానంలో నిర్మించతలపెట్టిన నూతన భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్లపై మంత్రివర్గం ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెల్లడించింది. డిజైన్లను ఖరారుచేసి ఆ వివరాలతో కౌంటర్‌ దాఖలుచేయాలని గత విచారణ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేశారు. డిజైన్లు ఫైనల్‌ అయిన తర్వాతే ఏయేశాఖకు ఎంత స్థలం కేటాయించేది తెలుస్తుందని పేర్కొన్నారు. 


డిజైన్లపై క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొ న్న తర్వాత తుది ప్రణాళికలను ఆర్కిటెక్ట్‌ సం స్థలు సమర్పిస్తాయని, అప్పటివరకు ప్లింత్‌ ఏరియా, పార్కింగ్‌, గ్రీన్‌ జోన్‌, ఏయే శాఖలకు ఎంతస్థలం కేటాయించారన్న అంశాలపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఇది కేవలం స్థలానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నమూనాలు ఉన్నాయా? లేదా? అనే దానికి ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. డిజైన్లను క్యాబినెట్‌ ఖరారు చేయకుండా వివరాలు వెల్లడించిన తర్వాత ఏమై నా మార్పులు ఉంటే ప్రతిపక్ష పార్టీలు క్యాబినెట్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాల్‌ చేసే అవకాశం ఉన్నదన్నారు. డిజైన్ల విషయంలో నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లేలా ప్రభుత్వానికి స్వేచ్ఛనివ్వాలని ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి కోరారు. ఏఏజీ వాదనలు వినిపిస్తూ.. సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంకా తుది నిర్ణయం జరుగకముందే పిటిషన్లు దాఖలుచేశారని.. 


ఈ పిటిషన్లు ప్రీమెచ్యూర్డ్‌ పిటిషన్లుగా ప్రకటించాలని కోరారు. అయితే, తుది నిర్ణయం తీసుకోకుం డా ప్రస్తుత భవనాలను కూల్చివేయాలని ఎలానిర్ణయించారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుత టెక్నాలజీయుగంలో ఆర్కిటెక్ట్‌ సంస్థలు తక్కువ సమయంలోనే నమూనాలు ఇస్తున్నాయని, టెక్నాలజీ సాయంతో వేగంగా డిజైన్లను రూపొందిస్తున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంత సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. డిజైన్లు, ఇతర నిర్మాణపరమైన అంశాలపై క్యాబినెట్‌ తుది నిర్ణయం తీసుకొనే వరకు ఈ కేసులను పెండింగ్‌లో ఉంచుతామని, తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ప్రస్తుత భవనాలను కూల్చవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.


logo