e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home తెలంగాణ సెకండ్‌వేవ్‌.. జూన్‌తో ఖతం

సెకండ్‌వేవ్‌.. జూన్‌తో ఖతం

సెకండ్‌వేవ్‌.. జూన్‌తో ఖతం
  • రాష్ట్రంలో రెండువారాలుగా కేసులు తగ్గుముఖం
  • జ్వరసర్వేతో గ్రామాల్లో పాజిటివిటీ పరార్‌
  • పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలు, బ్లాక్‌ ఫంగస్‌పై ప్రత్యేక దృష్టి
  • మొదటిదశలో 7.75 లక్షల మంది సూపర్‌స్ప్రెడర్స్‌కు టీకా
  • జిల్లాల్లోని దవాఖానల్లోనూ బ్లాక్‌ఫంగస్‌ చికిత్స
  • మీడియాతో డీఎంహెచ్‌ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి
  • ఈ నెలాఖరు వరకు పరిస్థితి అదుపులోకి డీఎంహెచ్‌

హైదరాబాద్‌, మే 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండువారాలుగా కరోనా కొత్తకేసులు, పాజిటివిటీ రేటు తగ్గుముఖం పడుతున్నట్టు ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. వారంలో పరిస్థితి అదుపులోకి వస్తుందని.. వచ్చేనెలలో సెకండ్‌వేవ్‌ నుంచి బయటపడే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. డీఎంఈ రమేశ్‌రెడ్డితో కలిసి డీఎంహెచ్‌ శ్రీనివాసరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 28 వ తేదీ నుంచి మూడు రోజులపాటు మొదటిదశలో 7.75 లక్షల మంది సూపర్‌స్ప్రెడర్స్‌కు టీకా వేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నారని, కట్టడికి కావాల్సిన సూచనలు చేస్తున్నారని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలోని రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్‌ టీకాలు, కరోనా చికిత్సకు ఔషధాలను అందుబాటులో ఉంచడం, వాటి రవాణాపై దృష్టిపెట్టిందని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు దవాఖానల్లో వసతులను పర్యవేక్షిస్తున్నారని, సలహాలు, సూచనలు ఇస్తున్నారని వెల్లడించారు. కరోనా సమయంలో సీనియర్‌ రెసిడెంట్లు, జూనియర్‌ డాక్టర్ల సేవలను గుర్తించి వారి గౌరవ వేతనాలు పెంచేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు.

పాజిటివిటీ రేటు.. జాతీయ సగటులో సగం

ఈ వారం ప్రారంభంలో పాజిటివిటీ రేటు 6.1 శాతంగా ఉండేదని.. ప్రస్తుతం అది 4.1 శాతానికి తగ్గిందని శ్రీనివాసరావు తెలిపారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకారం పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉంటే కరోనా కట్టడిలో ఉన్నట్టేనన్నారు. తెలంగాణ ఎప్పుడో దానిని సాధించిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని, జూన్‌ చివరినాటికి సెకండ్‌వేవ్‌ నుంచి బయటపడుతామని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతి 10 లక్షల జనాభాకు 3.95 లక్షల పరీక్షలు నిర్వహించామని తెలిపారు. త్వరలో అవసరమైతే లక్షన్నర టెస్టులకు సిద్ధమని వెల్లడించారు.

పాజిటివిటీ రేటు

  • రాష్ట్రంలో ప్రసుత్తం : 4.1%
  • రాష్ట్ర సగటు : 3.82%
  • జాతీయ సగటు : 8.1%

జ్వరసర్వే విజయవంతం

కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,518 దవాఖానల్లో ‘కొవిడ్‌ ఓపీ సర్వే’ ప్రారంభించినట్టు డీఎంహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. వీటిద్వారా ఇప్పటివరకు 13,05,793 మందిని పరీక్షించినట్టు చెప్పారు. ఇందులో 2,97,512 మందికి లక్షణాలు గుర్తించి కిట్స్‌ అందజేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో నిర్వహించిన జ్వరసర్వేతో అనేక కోణాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని చెప్పారు. మొదటి విడుతలో రాష్ట్రవ్యాప్తంగా 33,374 బృందాలు 1,01,28,711 ఇండ్లను సర్వే చేశాయన్నారు. 2,41,103 మందిలో కరోనా అనుమానిత లక్షణాలను గుర్తించి కిట్స్‌ ఇచ్చినట్టు చెప్పారు. వారి ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తున్నామన్నారు. జిల్లాల్లో జ్వరసర్వే 99 శాతం పూర్తయిందని చెప్పారు. ఇటీవలే రెండోవిడుత సర్వే ప్రారంభించామని.. 17,089 బృందాలు ఇప్పటివరకు 46,70,358 ఇండ్లు తిరిగాయని తెలిపారు. 1,57,963 మందికి జ్వర లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని, ఇందులో 93 వేల మందికిపైగా కిట్లు అందజేశామన్నారు. దీంతో గ్రామాల్లో కరోనా నియంత్రణలోకి వచ్చిందని చెప్పారు. చాలారాష్ర్టాల్లో ఇప్పుడు కరోనా ఉద్ధృతి పట్టణాల నుంచి, గ్రామాలకు చేరిందని దీంతో పల్లెల్లో కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణలో 2-3 వారాల ముందే జ్వరసర్వే చేపట్టడంతో గ్రామాల్లో కొవిడ్‌ కేసులు నియంత్రణలో ఉన్నాయని వివరించారు.

దవాఖానల్లో 23,745 మంది

రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం, డిశ్చార్జిలు పెరుగుతుండటంతో దవాఖానల్లో పడకలు ఖాళీ అవుతున్నాయని శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55,125 పడకలు ఉన్నాయని, వారంలోనే కొత్తగా 2వేల పడకలు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇందులో 31,317 బెడ్స్‌ ఖాళీగా ఉన్నాయని, 23,745 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఇందులో 40% పొరుగురాష్ర్టాలవారేనని పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ఢిల్లీ, ముంబై తర్వాతి స్థానంలో తెలంగాణ ఉన్నదని చెప్పారు. గాంధీ, టిమ్స్‌ వంటి దవాఖానల్లో ఎక్కువగా తీవ్రంగా జబ్బుపడిన పేషెంట్లు ఉండటంతో పడకలు తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.

వేగంగా వ్యాక్సినేషన్‌కు చర్యలు

ఇప్పటివరకు రాష్ట్రంలో 56 లక్షల మందికి టీకాలువేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. కొవిషీల్డ్‌ రెండోడోస్‌ గడువు 12-16 వారాలకు పెంచడంతో అర్హులైనవారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరూలేరని.. ఈ నెలాఖరు వరకు 2.5 లక్షల మందికి కొవాగ్జిన్‌ రెండోడోస్‌ ఇవ్వాల్సి ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం 6.18 లక్షల డోసుల కొవిషీల్డ్‌ టీకాలు ఉన్నాయని, జూన్‌ మొదటివారంలో మరో 3.35 లక్షల డోసులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 2.5 లక్షల కొవాగ్జిన్‌ డోసులు తెప్పించిందని, మరో 2.5 లక్షల డోసులు వచ్చే వారం రావొచ్చన్నారు. ప్రస్తుతం 244 ప్రైవేట్‌ టీకాకేంద్రాలు ఉన్నాయని.. వాటిని 1000-1200 పెంచాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు ప్రతిఒక్కరూ లాక్‌డౌన్‌కు సహకరించారని, ఇకపైనా కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

బ్లాక్‌ ఫంగస్‌కు ప్రత్యామ్నాయ మందులు

బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు అనేక ప్రత్యామ్నాయ మందులు ఉన్నాయని రమేశ్‌రెడ్డి తెలిపారు. ఇవి ఆంఫోటెరిసిన్‌తో సమానంగా పనిచేస్తాయన్నారు. సాధారణంగా ఆంఫోటెరిసిన్‌ను అరుదుగా వాడుతారని, కాబట్టి ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. ఒక్కసారిగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరుగటంతో ఆంఫోటెరిసిన్‌కు డిమాండ్‌ పెరిగిందని.. అదేస్థాయిలో ఉత్పత్తి పెంచాలంటే రెండునుంచి మూడు వారాలు పడుతుందని వివరించారు. అయితే, అదేస్థాయిలో పనిచేసే అనేక ఇతర మందులు ఉన్నాయని స్పష్టంచేశారు. కొన్ని ప్రైవేట్‌ దవాఖానలు ఒకే ఔషధాన్ని రెఫర్‌ చేస్తుండటంతో ఇబ్బంది ఎదురవుతున్నదని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌తో వందల మంది చనిపోతున్నారన్న వదంతులు నమ్మొద్దని పేర్కొన్నారు.

ప్రజావసరాలు తీర్చేవారికి ప్రత్యేక డ్రైవ్‌

ప్రజలతో నిరంతరం సంబంధాలు కలిగి ఉండి, వారి అత్యవసరాలను తీర్చేవారిని సూపర్‌ స్ప్రెడర్స్‌గా పిలుస్తున్నామని డీఎంహెచ్‌ పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకార్థం తీసుకోవద్దని, వారంతా హైరిస్క్‌ గ్రూప్‌ అని అభివర్ణించారు. థర్డ్‌వేవ్‌ను అడ్డుకోవాలన్నా, హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలన్నా వీరికి టీకాలు వేయడం అత్యవసరమన్నారు. వీరికి టీకాలు వేసేందుకు ఈ నెల 28, 29, 30 తేదీల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపడుతున్నామని తెలిపారు. మొదటి దశలో 7.75 లక్షల మందికి టీకాలు వేస్తామన్నారు. పౌరసరఫరాలశాఖ ద్వారా 33,980 మంది రేషన్‌, 49,611 మంది గ్యాస్‌డీలర్లు, సిబ్బంది, 1,435 మంది ఫుడ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు టీకాలు అందిస్తామని చెప్పారు. వ్యవసాయశాఖ సమన్వయంతో 30 వేల మంది ఎరువుల దుకాణాదారులు, సిబ్బందికి, సమాచార పౌరసంబంధాలశాఖ ద్వారా 20 వేల మంది గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టీకాలు వేస్తామని తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 లక్షల మంది ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తామని వివరించారు. వీరితోపాటు రైతుబజార్లలో వర్తకులు, మార్కెట్‌యార్డుల్లోని సిబ్బంది, హమాలీలు, వీధి వ్యాపారులు, సెలూన్ల నిర్వాహకులు వంటివారిని 3 లక్షల మందిని గుర్తించామని, కిరాణా షాపుల యజమానులు, సహాయకులు మరో 91 వేల మంది ఉంటారని, వీరందరికీ టీకాలు వేస్తామని వెల్లడించారు. వీరి వివరాలను సేకరించే బాధ్యతను జిల్లా స్థాయిలో ఆయా శాఖల అధికారులకు అప్పగించారు.

ప్రత్యేకంగా ‘పోస్ట్‌ కొవిడ్‌ ఓపీ’

రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, ఇతర సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోస్ట్‌ కొవిడ్‌ చికిత్సపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు డీఎంఈ రమేశ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దవాఖానల్లో ‘పోస్ట్‌ కొవిడ్‌ ఔట్‌ పేషెంట్స్‌’ కేంద్రాలు ఒకట్రెండు రోజుల్లో ప్రారంభమవుతాయని తెలిపారు. ముక్కులో నుంచి రక్తం, నల్లని చుక్కలు కారడం, చెంపలు ఉబ్బడం, చర్మంపై నల్ల చుక్కలు వంటివి ఉంటే జాగ్రత్త పడాలని సూచించారు. ప్రస్తుతం ఈఎన్టీలో 240 మందికిపైగా చికిత్స పొందుతున్నారని.. రోజూ 20కి పైగా ఆపరేషన్లు చేస్తున్నారని వివరించారు. ఈఎన్టీ, గాంధీతోపాటు జిల్లాల్లోని వైద్యకళాశాలల్లో, వరంగల్‌, కరీంనగర్‌ వంటి ప్రధాన జిల్లా దవాఖానల్లో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ప్రారంభించామని, రోగులు హైదరాబాద్‌కు రావాల్సిన పని లేదని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సెకండ్‌వేవ్‌.. జూన్‌తో ఖతం

ట్రెండింగ్‌

Advertisement