గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 15, 2020 , 02:15:25

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా

ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా
  • హైదరాబాద్‌లో రెండో పాజిటివ్‌ కేసు
  • కోలుకొని ఇంటికిచేరిన మొదటివ్యక్తి
  • గాంధీలో మరిన్ని కరోనా వార్డులు
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మరో రెండు స్క్రీనింగ్‌ పరికరాలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లో కరోనా సోకిన మొదటివ్యక్తి పూర్తిగా కోలుకొని ఇంటికి చేరగా, తాజాగా రెండో కేసు నమోదైంది. ఈ నెల 7న ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం ప్రకటించారు. వ్యాధి లక్షణాలున్న మరో ఇద్దరి రక్తనమూనాలను పుణెలోని పరిశోధన సంస్థకు పంపామని తెలిపారు. కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం పలు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో ఐసొలేషన్‌ వార్డులను పెంచింది. దవాఖాన భవనంలోని 8వ అంతస్తులో ఉన్న నర్సింగ్‌ స్కూల్‌ను ఖాళీచేసి 150 పడకలతో కొత్త వార్డును ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌ తెలిపారు. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులను పరీక్షించేందుకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అదనంగా మరో రెండు థర్మల్‌స్క్రీనింగ్‌లను ఏర్పాటు చేశారు. ఎయిర్‌పోర్టులో ఇంతవరకు 60,830 మందిని స్క్రీనింగ్‌ చేసినట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో తెలిపింది. గాంధీ, ఫీవర్‌ దవాఖానల్లో 25 మంది ఐసొలేషన్‌ వార్డుల్లో ఉన్నారని తెలిపింది. ఆరోగ్యశాఖ సూచనమేరకు మరో 14 మంది వారి ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉన్నట్టు పేర్కొంది. గాంధీ దవాఖానలో శనివారం 14మందికి ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయగా, వారి నివేదికలు రావాల్సి ఉంది. కరోనా అనుమానితులను దవాఖానలకు తరలించేందుకు తగిన సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచినట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. 


logo
>>>>>>