శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 06:54:38

ఇవాళ గ్రేట‌ర్‌ నామినేష‌న్ల ప‌రిశీల‌న.. రేపు తుది జాబితా‌

ఇవాళ గ్రేట‌ర్‌ నామినేష‌న్ల ప‌రిశీల‌న.. రేపు తుది జాబితా‌

హైద‌రాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నికల‌ నామినేష‌న్ల గ‌డ‌వు నిన్న‌టితో ముగిసింది. దీంతో నిన్న‌టివ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల నామినేష‌న్ల‌ను ఎన్నికల అధికారులు ఇవాళ పరిశీలించ‌నున్నారు. ఫార్మ్-ఏ ఇచ్చేందుకు ఇప్ప‌టికే గ‌డువు ముగిడంతో అభ్య‌ర్థులు ఈరోజు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు బీ-ఫార్మ్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా రేపు మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకోవడానికి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ అవ‌కాశం క‌ల్పించింది. అనంత‌రం ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న అభ్య‌ర్థుల తుది జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు.

గ్రేటర్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ముగిసింది. మొత్తం 150 వార్డుల‌కు గాను 1,633 మంది అభ్యర్థులు 2,226 నామినేషన్లు దాఖలుచేశారు. ఇందులో టీఆర్‌ఎస్‌- 493, బీజేపీ-494, సీపీఐ-15, సీపీఎం-24, కాంగ్రెస్‌-312, మజ్లిస్‌-66, టీడీపీ-186, గుర్తింపు పొందిన ఇతర పార్టీలు- 86, స్వతంత్రుల నుంచి 550నామినేషన్లు దాఖలయ్యాయి. 

చివ‌రి రోజైన శుక్ర‌వారం పెద్దఎత్తున నామినేష‌న్లు దాఖ‌ల‌య్యాయి. నిన్న ఒక్క‌రోజే 1,646 నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తిచేస్తారు. ఆదివారం సాయంత్రం మూడు గంటల వరకు ఉపసంహరణలకు గడువు ఉంటుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు.