శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 01:32:42

అభ్యర్థుల ఖర్చు 5 లక్షలు మించొద్దు

అభ్యర్థుల ఖర్చు 5 లక్షలు మించొద్దు

  • ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో 1,000 లోపు ఓటర్లు
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ పార్థసారథి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీలో కార్పొరేటర్లుగా పోటీచేసే అభ్యర్థులు రూ.5 లక్షలకు మించి ఎన్నికల వ్యయం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 2016 ఎన్నికల్లో అమలుచేసిన రిజర్వేషన్లనే ఇప్పుడూ అమలుచేయాలని సూచించారు. రంగారెడ్డి, హైదరాబాద్‌, సంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల అదనపు కలెక్టర్లను డిప్యూటీ ఎలక్షన్‌ అధికారులుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో అదనపు కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను పూర్తిచేయాలని ఆదేశించారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో పార్థసారథి సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020, ఫిబ్రవరి 10వ తేదీన ప్రస్తుత పాలకవర్గ కాలపరిమితి ముగుస్తున్నదని, ఆలోగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కరోనాను దృష్టిలో ఉంచుకొని విశాలమైన గదులు ఉండేలా పోలింగ్‌ కేంద్రాలను గుర్తించాలని, స్థానిక రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో సంప్రదించి సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలను కనిపెట్టాలని సూచించారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో వెయ్యి మందికి మించకుండా ఓటర్లు ఉండేలా చూడాలని, ప్రతి కేంద్రానికి ఒక ప్రిసైడింగ్‌ అధికారి, నలుగురు ఇతర పోలింగ్‌ అధికారులను నియమించాలని చెప్పారు. పోలీస్‌ అధికారులతో కలిసి బందోబస్తు ప్రణాళిక తయారుచేయాలని, స్టాటిక్‌ సర్వేలైన్స్‌, ైప్లెయింగ్‌ స్కాడ్‌లను నియమించుకోవాలని సూచించారు.

బ్యాలెట్‌ బాక్సులను సురక్షితంగా భద్రపరిచేందుకు, డిస్ట్రిబ్యూషన్‌, రిసెప్షన్‌, కౌంటింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు అనువుగా ఉండే ప్రాంతాలను గుర్తించి ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. శనివారం ముసాయిదా ఓటర్ల జాబితా, 13న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉంటుందని అన్నారు. తుది జాబితా ప్రచురించిన నాటినుంచి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదయ్యేవరకు ఓటరుగా నమోదుచేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులకు సూచించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్లు శ్వేతా మహంతి, అమోయ్‌కుమార్‌, వాసం వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.