బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:17:34

ఒక్కో కేంద్రానికి 800 ఓటర్లేl

ఒక్కో కేంద్రానికి 800 ఓటర్లేl

  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఎస్‌ఈసీ కసరత్తు
  • పోలింగ్‌కు ఈవీఎంలా.. బ్యాలెట్‌ బాక్సులా?
  • ముందస్తు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ పార్థసారథి సమీక్ష

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఫిబ్రవరి 10వ తేదీతో జీహెచ్‌ఎంసీ పాలకవర్గానికి పదవీకాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ పార్థసారథి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో వచ్చే సమస్యలు, సవాళ్లపై చర్చించారు. ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ, పోలింగ్‌, ర్యాండమైజేషన్‌, సిబ్బంది మొదలైన ఎన్నికల ప్రక్రియపై సమీక్షించారు. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఫేస్‌ రికగ్నైజేషన్‌ను వినియోగించేలా జీహెచ్‌ఎంసీ జోనల్‌, సర్కిల్‌ లెవల్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలని ఎస్‌ఈసీ సూచించారు. గత ఎన్నికల్లో నమోదైన 45.29% పోలింగ్‌ను ఈసారి మెరుగుపరిచేలా అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికలకు ఈవీఎంలు ఉపయోగించాలా లేక బ్యాలెట్‌ బాక్సులు వాడాలా అనేదానిపై సుదీర్ఘంగా చర్చించారు. కరోనా నేపథ్యంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 800 మంది ఓటర్లను మాత్రమే కేటాయించాలని నిర్ణయించారు. అక్టోబర్‌ రెండోవారంలో జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో సమావేశం నిర్వహించాలని అదనపు సీఈవోకు పార్థసారథి సూచించారు.