మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:47:31

అమరుడి కుటుంబానికి ఓదార్పు రేపు

అమరుడి కుటుంబానికి ఓదార్పు రేపు

  • సూర్యాపేటకు వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి పరామర్శ 
  • 5 కోట్ల రూపాయల ఆర్థికసాయంతోపాటు 
  • ఉద్యోగ ఉత్తర్వులను అందించనున్న సీఎం
  • వెల్లడించిన విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట, నమస్తే తెలంగాణ: పుట్టెడు దుఃఖంలో ఉన్న అమరుడి కుటుంబాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆత్మీయంగా పలుకరించనున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబసభ్యులను సోమవారం స్వయంగా సూర్యాపేటకు వెళ్లి ఓదార్చి పరామర్శించనున్నారు. ఆ కుటుంబానికి అయిన ‘గల్వాన్‌' గాయాన్ని కొంతైనా మాన్పించేలా ధైర్యం చెప్పనున్నారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యుల అభీష్టం మేరకు సీఎం కేసీఆర్‌ పర్యటనను సోమవారం ఖరారు చేసినట్టు విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున ప్రకటించిన రూ.5 కోట్ల ఆర్థికసాయంతోపాటు గ్రూప్‌-1 ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు అందజేస్తారని తెలిపారు. 600 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు సీఎం ఇప్పటికే ప్రకటించారని గుర్తుచేశారు. జాగా సూర్యాపేటలోనా ...ఆత్మీయ ఓదార్పు రేపు

లేదా హైదరాబాద్‌లోనా అన్నది కుటుంబసభ్యుల ఇష్టానుసారం ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని చెప్పారు. సంతోష్‌బాబు సేవలు యువతకు స్ఫూర్తిగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పమని పేర్కొన్నారు. అమరుడి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి అందించనున్న సాయంపై సంతోష్‌ కుటుంబసభ్యులతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. కర్నల్‌ కుటుంబంతో సహా దేశంలోని మిగతా ప్రాంతాల్లోని సైనికులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం ఆయన గొప్ప మనసుకు అద్దం పడుతున్నదని చెప్పారు. అంతకుముందు మంత్రి జగదీశ్‌రెడ్డి, సునీత దంపతులు సూర్యాపేటలోని సంతోష్‌బాబు నివాసానికి వెళ్లి కటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఉన్నారు.


సీఎం కేసీఆర్‌ది పెద్ద మనసు 

- కర్నల్‌ సంతోష్‌ తల్లిదండ్రులు మంజుల, ఉపేందర్‌ 

సూర్యాపేట టౌన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ది పెద్ద మనసు అని అమరుడు కర్నల్‌ సంతోష్‌బాబు తల్లిదండ్రులు బిక్కుమళ్ల మంజుల, ఉపేందర్‌ అన్నారు. ఆయన తమ కుటుంబానికి కొండంత అండగా నిలిచి ధైర్యాన్ని నింపిన మహనీయుడని కొనియాడారు. తమతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన జవాన్ల కుటుంబాలకు సాయం ప్రకటించి యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. శనివారం సూర్యాపేటలోని తమ నివాసంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆరే స్వయంగా తమ ఇంటికి వచ్చి ఆర్థికసాయం అందిస్తారని మంత్రి చెప్పడంతో ఆశ్చర్యానికి లోనయ్యామని చెప్పారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు.logo