సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 01:37:47

కరీంనగర్‌ క్షేమం!

కరీంనగర్‌ క్షేమం!

-తొలిరోజు 25 వేల మందికి స్క్రీనింగ్‌

-కనిపించని కరోనా లక్షణాలు 

-నగరమంతా స్క్రీనింగ్‌ చేస్తాం: మంత్రి గంగుల  కమలాకర్‌ 

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనా పాజిటివ్‌తో ఇండోనేషియా నుంచి వచ్చిన మతప్రచారకులు రెండురోజులు గడిపిన కరీంనగర్‌ జిల్లా కేంద్రం ప్రస్తుతానికి క్షేమం. కలెక్టరేట్‌కు సమీపంలోని మసీదులో మతప్రచారకులు బసచేసిన ప్రాంతం నుంచి 200 మీటర్ల పరిధిలోనే తిరిగారని, ఆ ప్రాంతంలో ఎవరిలోనూ కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించలేదని బీసీ సంక్షేమ,పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. వీరిని కలిసిన కొందరిని గాంధీ దవాఖానకు పంపించగా వైరస్‌ సోకలేదని తేలిందని, అయినప్పటికీ మరోసారి పరీక్ష కోసం చల్మెడ దవాఖానకు పంపించామని పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో వందవైద్య బృందాలు ఇంటింటికి వెళ్లాయి. ఎవరైనా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా? కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నాయా? ఇటీవల విదేశాల నుంచి ఎవరైనా వచ్చారా?అనే వివరాలను సేకరించాయి. మతప్రచారకులు బసచేసిన ముకరంపురలో వైద్యబృందాలతో కలిసి బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించారు. రాత్రి మీడియాతో మాట్లాడుతూ తొలిరోజు 6,126 వేల ఇండ్లలో 25 వేల మందికి స్క్రీనింగ్‌ చేయగా ఏ ఒక్కరిలోనూ కరోనావైరస్‌ లక్షణాలు కనిపించలేదని తెలిపారు. కరీంనగర్‌లోని 90 వేల గృహాల్లో నెలాఖరు వరకు స్క్రీనింగ్‌ కొనసాగుతుందని చెప్పారు. వివిధదేశాల నుంచి 20 మంది వచ్చినట్టు గుర్తించామని, వారిలో కరోనా వైరస్‌ లక్షణాలు లేకపోయినా ముందుజాగ్రత్తగా ఇండ్లలోనే స్వీయనిర్బంధం చేసుకొని ఉండాలని సూచించామని చెప్పారు.  

ఆపరేషన్‌ కరీంనగర్‌

మతప్రచారకుల్లో ఎనిమిది మందికి కరోనావైరస్‌ సోకిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగింది. ఏమాత్రం అనుమానం వచ్చినా దవాఖానకు తరలించేందుకు వాహనాలు సిద్ధంగా ఉంచాయి. జిల్లాకేంద్ర దవాఖానలో 20 బెడ్స్‌, ప్రైవేటు దవాఖానలైన ప్రతిమ, చల్మెడలో 50 చొప్పున ఐసోలేషన్‌ బెడ్స్‌ ఏర్పాటుచేశారు.  పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కోర్టును 22 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. కలెక్టరేట్‌ ప్రధానద్వారానికి తాళం వేశారు. రెండో గేటునుంచి మాత్రమే అనుమతిస్తున్నారు.


logo